జాతీయ వార్తలు

వారికిక బుద్ధిచెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్, ఫిబ్రవరి 5: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లభిస్తుందన్న భయంతోనే ప్రతిపక్షాలన్నీ చేతులు కలుపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. యుపిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అలీగఢ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ మరోసారి సమాజ్‌వాది పార్టీ-కాంగ్రెస్‌ల పొత్తుపై విమర్శలు గుప్పించారు. తన మనుగడ కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. బిజెపి తుపానుకు భయపడిన అఖిలేశ్ యాదవ్ అధికారంలోకి కొనసాగడానికి దేన్నయినా పట్టుకొంటున్నారని, అయినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండదన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు దోచుకునే ప్రభుత్వాన్ని, శాంతిభద్రతలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారని, ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయకుండా తమకోసం పనిచేసే బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బిజెపిని గెలిపిస్తే రాష్ట్రానికి ‘వికాస్’- అంటే విద్యుత్, కానూన్ (శాంతిభద్రతలు), సడక్ (రోడ్లు) తీసుకు వస్తుందన్నారు. 2014లో తాను ప్రచారంకోసం అలీగఢ్ వచ్చినప్పుడు ఈ మైదానంలో సగంకూడా నిండలేదన్న మోదీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాషాయ సముద్రమే కనిపిస్తోందన్నారు. బిజెపి తుపాను ఇంత బలంగా ఉన్నందునే ముఖ్యమంత్రి తాను ఎక్కడ ఎగిరి పోతానోనని భయపడుతున్నారన్నారు. అయితే యుపి ఓటర్లు ఈసారి మార్పును కోరుకుంటున్నారన్నారు. యుపిలో గత ప్రభుత్వాలు ఎలా పని చేశాయంటే తగినంత విద్యుత్ సరఫరా చేయలేక పోవడంవల్ల అలీగఢ్‌లో తాళాల పరిశ్రమ మూతపడిపోయిందన్నారు.
యుపిలో చోటు చేసుకుంటున్న నేరాల గురించి ప్రస్తావిస్తూ.. ఒక్క రోజులో రాష్ట్రంలో 7,650 నేరాలు, 24 రేప్‌లు, 21 అత్యాచార యత్నాలు, 13 హత్యలు, 33 కిడ్నాప్‌లు, 19 అల్లర్లు, 136 దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మాయావతి అధికారంలో ఉన్నప్పుడు దేశంలో జరిగే ప్రధాన నేరాల్లో మూడింటితో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా, యువకుడైన అఖిలేశ్ వచ్చాక, రాష్ట్రాన్ని అయిదు నేరాల్లో అగ్రస్థానాల్లో నిలిపారని దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా 18 వేల గ్రామాలు ఇంకా విద్యుత్‌కు నోచుకోలేదని, ఈ గ్రామాల్లో ఎక్కువ భాగం యుపిలోనే ఉన్నాయన్నారు. ఈ గ్రామాలన్నిటికీ విద్యుత్‌ను అందించడానికి తమ ప్రభుత్వం ఓ ఉద్యమస్ఫూర్తితో పని చేస్తోందన్నారు. గ్రామీణ భారతాన్ని పొగరహితంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఉజ్వల యోజన పథకం కింద గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు.
యువకుల గురించి ప్రస్తావిస్తూ, అవినీతి, కులతత్వం, బంధుప్రీతిలాంటి వాటికి స్వస్తి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కిందిస్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేసిందని, యుపిలో ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇంటర్వ్యూలకోసం రాష్ట్రంలో యువకులు ఎమ్మెల్యేలు, మంత్రులకు లంచాలు ఇవ్వాల్సి రావడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ పేరుతో ప్రభుత్వం ‘్భమ్’ యాప్‌ను ఆవిష్కరించిందని, అయితే అంబేద్కర్ పేరు ప్రస్తావించడానికి మోదీకి ఏం హక్కు ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఎవరు ఏమనుకున్నా ఆయన గొప్ప ఆర్థికవేత్త అని, దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఎవరేమనుకన్నా సరే తాను అంబేద్కర్‌ను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని చెప్పారు.

చిత్రం..అలీగఢ్‌లో ఆదివారం జరిగిన బిజెపి బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ