జాతీయ వార్తలు

బాల్‌థాకరే హత్యకు లష్కరే కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: శివసేన అధినేత దివంగత బాల్ థాకరేను హత్య చేయాలని లష్కరే తోయిబా అనుకొందని, అయితే ఆ పని అప్పగించిన వ్యక్తిని పని పూర్తి చేయక ముందే మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారని, అతను వారినుంచి తప్పించుకున్నాడని ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందన్న ఆరోపణలపై అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ గురువారం ముంబయి కోర్టుకు చెప్పాడు. 2008 ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారుడైన అబూ జుందాల్ తరఫు న్యాయవాది అబ్దుల్ వహాబ్ ఖాన్ రెండోరోజు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన సందర్భంగా అమెరికానుంచి వీడియో లింక్ ద్వారా హెడ్లీ ఈ విషయం చెప్పాడు. ముంబయిలోని శివసేన ప్రధాన కార్యాలయమైన సేనా భవన్‌ను తాను రెండుసార్లు సందర్శించినట్లు కూడా హెడ్లీ కోర్టుకు తెలియజేశాడు. అయితే తాను ఏ సంవత్సరంలో వెళ్లిందీ ఆయన కచ్చితంగా చెప్పలేదు. ‘లష్కరే తోయిబా శివసేన అధినేతను అంతం చేయాలని అనుకుంది. ఆయన పేరు బాల్ థాకరే.. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆయనను అంతం చేయాలని అనుకుంది. బాల్ థాకరే శివసేన అధినేత అనే విషయం నాకు తెలుసు’ అని హెడ్లీ చెప్పాడు. ఈ ప్రయత్నం ఎలా చేశారనేది తనకు తెలియదని, అయితే బాల్ థాకరేను హత్య చేసే బాధ్యతను అప్పగించిన వ్యక్తిని పోలీసులు ముందే అరెస్టు చేశారని చెప్పాడు.
26/11 దాడులకు ముందు ముంబయి రావడానికి, రెక్కీ నిర్వహించడానికి ఎంత డబ్బు ఖర్చు చేశావని అబ్దుల్ వాహబ్ ఖాన్ అడగ్గా, ‘కచ్చితంగా తెలియదు కానీ చాలా లక్షలే ఖర్చయింది. ఐఎస్‌ఐ ఈ సొమ్ము ఖర్చు చేసిందనేది నిజం. కానీ, నేను వాళ్లను డబ్బు డిమాండ్ చేశానన్నది మాత్రం నిజం కాదు’ అని హెడ్లీ చెప్పాడు.
2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిపిన పది మంది ఉగ్రవాదుల్లో ఎవరిని కూడా తాను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కానీ వారిలో ఒకరి ఫోటోను ఇంటర్నెట్‌లో చూశానని, అతడ్ని అజ్మల్ కసబ్ ‘రెహమతుల్లా అలియా’గా గుర్తు పట్టానని హెడ్లీ చెప్పాడు. కసబ్ పేరు తర్వాత రెహమతుల్లా అలియా అనే మాటలు ఎందుకు వాడుతున్నావని అడగ్గా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను మంచివాడైనా, చెడ్డవాడైనా అతడ్ని క్షమించమని దేవుడ్ని ప్రార్థించాలని హెడ్లీ అంటూ, కసబ్ మంచివాడో లేదా చెడ్డవాడో తనకు తెలియదని అన్నాడు. అయితే 26/11న జరిగిన సంఘటనల్లో పాలు పంచుకోవడం ద్వారా కసబ్ మంచి పని చేశాడా లేక చెడ్డ పని చేశాడా అని అడగ్గా, ఒక అమాయక వ్యక్తిని ఏ రకంగా హత్య చేసినా అది చెడ్డ పనేనని కూడా హెడ్లీ స్పష్టం చేశాడు.
26/11 కేసులో హెడ్లీ అప్రూవర్‌గా మారడంతో అమెరికా కోర్టు అతనికి 35 ఏళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అమెరికా చట్టం ప్రకారం తాను 80 శాతం జైలుశిక్షను అనుభవించిన తర్వాత జైలునుంచి విడుదల అయ్యే అవకాశముందని హెడ్లీ చెప్తూ, అయితే మిగతా శిక్షను రద్దు చేస్తారో లేదో తెలియదన్నాడు. అయితే ఈ కేసులో ఎఫ్‌బిఐ తనను అరెస్టు చేసిన తర్వాత అరగంటనుంచే తాను వారికి సహకరించడం ప్రారంభించానని హెడ్లీ చెప్పారు. భారత్‌నుంచి వచ్చిన ఎన్‌ఐఏ బృందం కూడా తనను ప్రశ్నించిందని, వారితో కూడా తాను సహకరించానని అతను చెప్పాడు.