జాతీయ వార్తలు

బీసీ ప్రయోజనాలు దెబ్బతీసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: కొత్తగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయటంద్వారా బీసీల ప్రయోజనాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లకు అధ్యక్షులు, ఇతర పదాధికారులను నియమించకుండా కుట్ర చేస్తోందంటూ మంగళవారం ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభను స్తంభింపజేశారు. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలివ్వడంతో సభను బుధవారానికి వాయిదా వేయక తప్పలేదు. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలకు అన్యాయం చేస్తోందని, ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలను మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎం.వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు తీవ్రంగా ఖండించారు. ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా ప్రతిపక్ష వైఖరిలో మార్పు రావటం లేదని వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లల్లో ఉన్న ఖాళీల గురించి కూడా చర్చ జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు.
మాయావతి మాట్లాడుతూ దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ దశలో వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవులు ఖాళీగా ఉన్నాయనే అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇంతలో నరేష్ ఆగర్వాల్, శరద్ యాదవ్ లేచి ఈ కమిషన్లలో పదవులు ఎందుకిలా ఖాళీగా ఉన్నాయనేది ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఈ అంశంపై చర్చ ప్రారంభించారా అని కురియన్‌ను అడిగారు. ప్రభుత్వం మొదట మా వాదన వినాలని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, బిఎస్‌పి నాయకుడు సతీష్ మిశ్రా డిమాండ్ చేశారు. తాను చర్చకు అనుమతించటం లేదని కురియన్ ప్రకటించటంతో సభలో గందరగోళం నెలకొన్నది. ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. పాత కమిషన్ స్థానంలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటును కమిషన్ అధ్యక్షుడు, న్యాయమూర్తి ఈశ్వరయ్య సమర్థించారని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రధాని కూడా వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తే అని గుర్తుచేశారు. ప్రతిపక్ష సభ్యులు మాత్రం పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇస్తూ గొడవ చేయటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ జీరో అవర్‌లో సభను మూడుసార్లు వాయిదా వేయక తప్పలేదు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు కమిషన్ల వివాదాన్ని ప్రస్తావించారు. చైర్మన్ హమీద్ అన్సారీ వారిని శాంతింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల సమస్యల గురించి చర్చించాలని శరద్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, గులాం నబీ ఆజాద్, ఏచూరి సీతారాం, మాయావతి డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని హమీద్ అన్సారీ స్పష్టం చేశారు. దీనితో ప్రతిపక్షం సభ్యులు మళ్లీ పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇవ్వటంతో సభ గందరగోళంలో పడిపోయింది. దీంతో రాజ్యసభ మంగళవారం ఎలాంటి కార్యక్రమం నిర్వహించకుండానే మరుసటి రోజుకి వాయిదా పడింది.

చిత్రం..రాజ్యసభలో మంగళవారం స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలిస్తున్న విపక్ష సభ్యులు