జాతీయ వార్తలు

తప్పుడు ఆదేశాలు పాటించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: రాజకీయ కార్యనిర్వాహకులు తప్పుడు ఆదేశాలు జారీచేస్తే వాటిని పాటించాల్సిన అవసరం లేదని, ఆ ఆదేశాలు తప్పని వెల్లడించే చట్టపరమైన నిబంధనలను వారికి చూపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు ఉద్బోధించారు. ‘మీరు చెబుతున్నది చట్టానికి వ్యతిరేకం అని వారికి తెలియజేయండి. ఫైల్ మీద సంతకం చేయకండి’ అని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ‘రాజకీయ కార్యనిర్వాహకులు ఏమి చెప్పినా తల ఊపే ‘యెస్ మాస్టర్’గా ఉండకండి. మీ అంతరాత్మను వంచించకండి’ అని ఆయన అధికారులకు హితవు పలికారు. ‘సివిల్ సర్వీసెస్ డే’ను పురస్కరించుకొని గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఐఎఎస్, ఇతర అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచించకూడదని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సమాజంలో మార్పులు తీసుకురావడంలో అధికారులు నిర్వహిస్తున్న కీలకపాత్రను ఆయన అభినందించారు. ఈ విధినిర్వహణ ప్రతి అధికారినీ బాధ్యత, జవాబుదారీతనం, పక్షపాతంతో వ్యవహరించే వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు. ‘సివిల్ సర్వీసెస్‌కు అధికారాలు ఉన్నాయి. అయితే, ఆ అధికారంతోపాటు పెద్ద బాధ్యత, జవాబుదారీతనం ఉన్నాయి. దీన్ని మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. బాధ్యత, జవాబుదారీతనంతోపాటు మన సివిల్ సర్వెంట్లకు మూడో అత్యంత ముఖ్యమైన అంశం నిష్పక్షపాతం. అది లోపిస్తే మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఉద్బోధించారు. నిర్ణయాలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న అధికారుల వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి సంకోచం దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. ‘అవసరమైతే, మీ సీనియర్లతో చర్చించండి. కాని, నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచించకండి’ అని సూచించారు. భారత రాజ్యపాలన విధానంలో ఎప్పుడూ శూన్యం ఆవరించలేదని, అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ అవిచ్ఛిన్నతను కొనసాగించడంలో సివిల్ సర్వెంట్లు ప్రముఖపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ‘్భరత ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణాలలో భారత్‌లో పరిపాలన నిరంతరాయంగా కొనసాగడం ఒకటి’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘జన్‌ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం’ (జామ్)లను కలపడం ద్వారా సుపరిపాలన స్మార్ట్ పాలనగా పరివర్తన చెందుతోందని ఆయన అన్నారు. దేశంలోని లక్షలాది మంది పేదలకు సబ్సిడీపై ఆహార పదార్థాలను అందించే పథకం ‘అంత్యోదయ’ను విజయవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్లు ఈ పథకం అమలులో మరింత చురుకైన, సమర్థవంతమైన పాత్ర పోషించవలసి ఉందని ఆయన అన్నారు.

చిత్రం..‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్