జాతీయ వార్తలు

సామరస్య రంగేళి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: రంగుల పండుగ హోలీని దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వయోభేదాన్ని మరిచి ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల దాకా ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఉదయంనుంచే వీధుల్లోకి వచ్చిన యువతీ యువకులు, పిల్లలు రంగు లు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లి పండుగను ఆసాంతం ఆస్వాదించారు. సినిమా పాటలు పాడుతూ, వాటి కనుగుణంగా డాన్స్‌లు చేస్తూ ఆబాల గోపాలం ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. రంగులు, కోడిగుడ్లు, టమోటాలను విసురుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బంధుమిత్రులతో పాటు పరిచయం లేని వారిపైనా రంగులు జల్లి ఆనందించారు.
రాజకీయ నాయకులు సైతం హోలీ వేడుకల్లో తమ హోదాను మరిచి ఆనందంతో పాలుపంచుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, తోటి నాయకులపై రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు పంచుతూ కుర్రకారుతో సమానంగా ఈ వేడుకను జరుపుకోవడం విశేషం. రంగుల్లో మునిగితేలిన నాయకులు యువతతో పలుచోట్ల సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఢిల్లీలో హోలీ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ శుభం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈసారి ముందు జాగ్రత్త తీసుకున్నట్లు కనపడింది. గతంలో ఓ యువతి తనపై ఇంకు జల్లిన ఘటన ఆయన ఇంకా మరిచిపోయినట్లు లేదు. ‘బయటినుంచి రంగులు తీసుకురావడం నిషిద్ధం’ అంటూ కేజ్రీవాల్ అధికార నివాసం ముందు హెచ్చరిక పోస్టర్‌ను అంటించడం ఈసారి హోలీ ప్రత్యేకత.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘హోలీ రంగుల పండుగ అనీ, మన జీవితాలతో పాటు దేశం కూడా అందంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలి. ఇతరుల తృప్తి కోసం మనం జీవించాలి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు.
కాగా, హోలీ వేడుకలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్ర దాడులు జరిగే ప్రమాదముందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రాష్ట్రాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ‘ప్రతి పండుగకు ముందు భద్రతను పెంచడం ఆనవాయితీ అనీ, ఇది దేశ రక్షణ కోసమే’నని పేర్కొన్నారు.