జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పునర్ వ్యవస్థీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు డిసెంబర్ 31లోగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉన్నది. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తోంది. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా కనీసం పది రాష్ట్రాలకు కొత్త పిసిసి అధ్యక్షులను నియమించి వీరిని సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో అధికారికంగా ఎంపిక చేయాలని ఆలోచిస్తోంది. పిసిసిలతోపాటు ఏఐసిసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా పెద్దఎత్తున మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. దీనితోపాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో కూడా మార్పులు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడుగా రాహుల్ గాంధీని ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్లిఖార్జున ఖర్గే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడుగా నియమితులైనందున ఆయన ప్రతిపక్ష నాయకత్వం నుండి తప్పుకోవటం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రతిపక్షం నాయకుడి పదవి చేపట్టేందుకు అంగీకరించని పక్షంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కమల్‌నాథ్ లేదా జ్యోతిరాదిత్య సింధియాను ప్రతిపక్ష నాయకుడుగా ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సీనియర్ నాయకుడైన కమల్‌నాథ్‌ను ప్రతిపక్షం నాయకుడిగా నియమిస్తే జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్ పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసిసిలో కూడా పెద్దఎత్తున మార్పులు, చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐదుగురు ప్రధాన కార్యదర్శులకు ఉద్వాసన చెప్పి వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 2019 తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి కలలు కంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్ల ప్రజల్లో నెలకొనే వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని బిజెపి భావిస్తోంది. అయితే బిజెపి తెలంగాణలో పట్టుసాధించకముందే తమ స్థానాన్ని పదిలం చేసుకోవటం ద్వారా 2019 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సిద్ధం చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌లో పలు మార్పులు చేయాలనుకుంటున్నట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పునర్‌వ్యవస్థీకరణంలో భాగంగా తెలంగాణ పిసిసిలో కూడా పలు మార్పులు ఉండవచ్చునని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జాతీయ యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ తదితర అన్ని అనుబంధ సంస్థలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని తెలిసింది.