జాతీయ వార్తలు

జూలై 10న మాల్యా రావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను జూలై 10న జరిగే విచారణకు తన ముందు హాజరయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తన ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించకపోవడం ద్వారా తన ఆదేశాలను ఉల్లంఘించినందుకు, అలాగే బ్రిటిష్ సంస్థ డియాజియోనుంచి అందిన 4 కోట్ల డాలర్ల (200 కోట్ల రూపాయలకుపైగా) నిధులను కర్నాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన ముగ్గురు కొడుకులకు బదిలీ చేసినందుకు మాల్యా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కాగా, ప్రస్తుతం మూతపడిన తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి బ్యాంకులనుంచి తీసుకున్న 9 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను తిరిగి చెల్లించకపోయిన కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న మాల్యాను వీలయినంత త్వరగా తమ దేశానికి పంపించి వేయాలని భారత ప్రభుత్వం బ్రిటన్‌ను కోరిన విషయం తెలిసిందే. కాగా ‘విజయ్ మాల్యా జూలై 10వ తేదీన మా ముందు హాజరయ్యేలా చూడాలని మేము హోం మంత్రిత్వ శాఖను ఆదేశిస్తున్నాం. ఈ ఆదేశాలను పాటించడానికి ఈ తీర్పు కాపీని హోం మంత్రిత్వ శాఖకు పంపించాలి’ అని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కోర్టు ధిక్కరణ నేరానికి గరిష్ఠంగా ఆరునెలల వరకు జైలుశిక్ష లేదా రూ.2వేల దాకా జరిమానా లేదా ఈ రెండూ విధించవచ్చు. కోర్టు ధిక్కరణ నోటీసుకు మాల్యా సమాధానం చెప్పడం కానీ లేదా స్వయంగా కోర్టు ఎదుట హాజరు కావడం కానీ చేయలేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆయన కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు రుజువు అయినందున ఆయనకు మరో అవకాశం ఇవ్వడం, ప్రతిపాదిత శిక్షపై ఆయన వాదనను వినడం అవసరమని తాము భావిస్తున్నామని, అందువల్ల ఈ విషయంలో విజయ్ మాల్యా చెప్పే దాన్ని వినడానికి కేసు విచారణను జూలై 10కి వాయిదా వేస్తున్నామని కోర్టు తన 26 పేజీల తీర్పులో పేర్కొంది.