జాతీయ వార్తలు

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. రాష్టప్రతి పదవికి శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అంతకుముందు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షడు ప్రకాశ్‌సింగ్ బాదల్, బిజెపి మార్గదర్శక మండలి సభ్యులు ఎల్‌కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ తదితరుల సమక్షంలో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రాకు అందజేశారు. అనూప్ మిశ్రా ఈ నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం కోవింద్‌కు రసీదును అందజేశారు. కోవింద్ నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించటం గమనార్హం.
బిజెపి, మిత్రపక్షాల నాయకులు మొదట పార్లమెంటు ఆవరణలోని లైబ్రరీలో గుమిగూడారు. అనంతరం అక్కడికి వచ్చిన కోవింద్‌ను కేంద్ర మంత్రులతో పాటు మిత్రపక్షాల ముఖ్యమంత్రులకు వెంకయ్య నాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పరిచయం చేశారు. కొద్దిసేపటికి ప్రధాని మోదీ కూడా లైబ్రరీకి వచ్చి అందరినీ పలకరించారు. ఆ తర్వాత మోదీ నాయకత్వంలో వారంతా లైబ్రరీ నుండి ఉరేగింపుగా బయలుదేరి పార్లమెంట్‌లోని లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి చేరుకున్నారు. సెక్రటరీ జనరల్ కార్యాలయంలో తంబిదురై, మురళీ మనోహర్ జోషి, అద్వానీ, రామ్‌నాథ్ కోవింద్, అమిత్ షా, ప్రకాశ్‌సింగ్ బాదల్, సుష్మా స్వరాజ్ ముందు వరుసలోనూ, కెసిఆర్, యోగి అధిత్యనాథ్, పళని స్వామి, చంద్రబాబు నాయుడు రెండో వరుసలోనూ కూర్చోగా, వారి వెనుక బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నాయకులు ఆశీనులయ్యారు. కోవింద్ సమర్పించిన నామినేషన్ పత్రాలను 10 నిమిషాల పాటు పరిశీలించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్, అవి సక్రమంగా ఉన్నాయని పేర్కొంటూ రశీదు ఇచ్చారు.
మహానుభావుల పరంపరను కొనసాగిస్తా
లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన అనంతరం కోవింద్ విలేఖరులతో మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రాజ్యాంగం పరిరక్షణతో పాటు దేశాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పారు. బిహార్ గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుండే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఇక మీదక కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. గతంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం తదితర మహానుభావులు రాష్టప్రతి పదవికి ఎంతో వనె్న తెచ్చారని, వారి పరంపరను, ఈ పదవి ఔన్నత్యాన్ని కాపాడుతానని కోవింద్ తెలిపారు.

చిత్రం.. శుక్రవారం నామినేషన్ వేసేందుకు పార్లమెంట్‌కు తరలివస్తున్న ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, బిజెపి సీనియర్ నాయకుడు అద్వానీ, ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి నేత అమిత్‌షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపి సిఎం చంద్రబాబు.