జాతీయ వార్తలు

తమిళనాట అమ్మ.. బెంగాల్‌లో దీదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో బిజెపి, అన్నా డిఎంకె, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, వాపపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా కొత్త చరిత్రను సృష్టించింది. అసోంలో భారీ మెజారిటీతో మొదటిసారి అధికారంలోకి రావటంతో పాటు కేరళ, పశ్చిమబెంగాల్‌లో తన ఖాతాలను తెరవటం ద్వారా బిజెపి కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టింది. పశ్చిమబెంగాల్‌లో బిజెపి ఏడు సీట్లు, కేరళలో ఒక సీటు గెలిచింది. అన్నా డిఎంకె అధ్యక్షురాలు జయలలిత తమిళనాడులో, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఘనమైన చరిత్ర సృష్టించారు. తమిళనాడులో 1984 తరువాత మొదటిసారి అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం గమనార్హం. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ అత్యధిక సీట్లు గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వామపక్షాలు కేరళలో అధికారంలోకి రావటం అందరూ ఊహించిందే. అయితే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చేతులు కాల్చుకుని చరిత్ర సృష్టించింది. కేరళలో కాంగ్రెస్‌తో పోటీ పడుతూ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకు రాష్ట్ర ప్రజలు వామపక్షాలకు గట్టి గుణపాఠం నేర్పించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అవకాశవాద రాజకీయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఛీకొట్టారు. తమిళనాడులో కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకు డిఎంకె అధ్యక్షుడు కరుణానిధికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తంగా మారటంతో కరుణానిధి చేతికి అధికారం అందినట్లే అంది జారిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ కేరళతో పాటు అసోంలో అధికారాన్ని కోల్పోయి చరిత్ర సృష్టించటంతో పాటు తమిళనాడులో డిఎంకెకు గుదిబండగా మారి కరుణానిధి అధికారంలోకి రాకుండా అడ్డుపడి మరో చరిత్ర సృష్టించింది. అయితే పుదుచ్చేరిలో అధికారంలోకి రావటం ద్వారా కాంగ్రెస్ చిన్న రాష్ట్రాల పార్టీగా మారిపోయి కొత్త చరిత్రను సృష్టించిందని చెప్పకతప్పదు. అసోంలో కాంగ్రెస్‌తో చేతులు కలిపిన ఏయుడిఎఫ్ అధినేత బదురుద్దీన్ కూడా చేతులు కాల్చుకున్నారు.
కరుణానిధి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఉంటే డిఎంకె సునాయాసంగా అధికారంలోకి వచ్చేది. డిఎంకె కేటాయించిన నలభై ఒక్క సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకోయింది. కరుణానిధి కాంగ్రెస్‌కు 41కి బదులు కేవలం పది సీట్లు ఇచ్చి మిగతా సీట్లలో తమ అభ్యర్థులను రంగంలోకి దించి ఉంటే అందులో నుండి పదిహేను సీట్లను సునాయాసంగా గెలుచుకుని అధికారంలోకి రాగలిగేవారు. కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం కావటంతో కరుణానిధి అధికారంలోకి రాలేకపోయారు.
అసోంలో బిజెపి ఘన విజయం
అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను కుదిపివేశాయి. శాసనసభలోని 126 సీట్ల నుండి 86 సీట్లు గెలుచుకోవటం ద్వారా బిజెపి కూటమి ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా కాలు మోపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చాలా కాలం నుండి పని చేస్తున్నా బిజెపి రాజకీయంగా రాణించలేకపోయింది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసోంలో అధికారంలోకి రావటం వల్ల బిజెపికి వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజకీయంగా కలిసివస్తుంది. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసినప్పటి నుండి బిజెపికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి నైతికంగా, రాజకీయంగా బాగా దెబ్బ తగిలింది. అసోంలో విజయం మోదీతో పాటు బిజెపికి కూడా బలాన్ని చేకూర్చి ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమయ్యేందుకు తోడ్పడుతుంది. సర్భానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం ద్వారా మోదీ ప్రదర్శించిన రాజకీయ విజ్ఞత మంచి ఫలితాలిచ్చిందని చెప్పకతప్పదు. బిజెపి కూటమి తొంబై సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ బలం 22కు పడిపోయింది. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన తరుణ్ గొగోయ్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. కింగ్ మేకర్ అవుదామనుకున్న ఏయుడిఎఫ్ అధినేత బదురుద్దీన్ కూటమి పద్నాలుగు సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. ఇతరులు రెండు సీట్లు గెలుచుకున్నారు. బిజెపి కూటమి అధికారంలోకి రావటంతో రాష్ట్రంలో తిష్ఠ వేసిన బంగ్లాదేశీయులు తిరుగుముఖం పట్టక తప్పదని అంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో..
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించిన చారిత్రాత్మక ఘన విజయం వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌కు మరణమృదంగంగా మారింది. కాంగ్రెస్, వామపక్షాలు చేతులు కలిపి సీట్ల సర్దుబాటు చేసుకోవటం రాష్ట్ర ప్రజలకు ఎంత మాత్రం నచ్చినట్లు లేదు. కాంగ్రెస్, వామపక్షాల ఎన్నికల పొత్తు తృణమూల్ కాంగ్రెస్‌కు వరప్రసాదంగా మారింది. రాష్ట్ర శాసనసభలో మొత్తం సీట్లు 294 ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 212 సీట్లతో అజేయ శక్తిగా మారింది. టిఎంసికి గతంలోకన్నా 24 సీట్లు అధికంగా రావటం గమనార్హం. సిపిఎం నేతృత్వంలోని వామపక్షాలు,కాంగ్రెస్ కూటమికి 76సీట్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్‌కు 44సీట్లు, లెఫ్ట్ కూటమికి 32సీట్లు వచ్చాయి, బిజెపికి మూడు సీట్లు, స్వతంత్య్ర అభ్యర్థులకు నాలుగు సీట్లు వచ్చాయి. పొత్తు మూలంగా కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగి వామపక్షాలు దెబ్బతిన్నాయి. బిజెపి ఏడు సీట్లు గెలుచుకొని అందరిని ఆశ్చర్యపరచింది.
తమిళనాడులో మొదటిసారి
తమిళనాడు ప్రజలు చాలా సంవత్సరాల తరువాత మొదటిసారి అధికారంలో ఉన్న పార్టీని వరుసగా రెండోసారి గెలిపించారు. జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకె 134సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె 89 సీట్లు గెలుచుకుని బలమైన ప్రత్యర్థిగా రంగంలోకి వచ్చింది. కరుణానిధి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఉంటే డిఎంకె అధికారంలోకి వచ్చేదని ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు దక్కాయి. విజయకాంత్ నాయకత్వంలోని డిఎండికె అన్ని సీట్లలో ఓడిపోయి చరిత్ర సృష్టించింది. పాత అసెంబ్లీలో డిఎండికె బలం 48. అన్నా డిఎంకెకు సామాన్య మెజారిటీ కంటే 35అధికంగా వచ్చాయి. ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో 30 సీట్లలో నుంచి కాంగ్రెస్-డిఎంకె కూటమి 17 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎన్‌ఆర్‌సికి ఎనిమిది సీట్లు లభించాయి. ఎడిఎంకెకు నాలుగు, ఇతరులకు ఒక సీటు దక్కింది.
కేరళలో వామపక్షాల విజయం
కేరళలో అందరూ ఊహించిన విధంగానే వామపక్షాలు విజయం సాధించాయి. అయితే బిజెపి ఒక సీటు, పదిహేను శాతం ఓట్లతో తన ఖాతా ప్రారంభించటం గమనార్హం. వామపక్షాల కూటమి ఎల్‌డిఎఫ్ 85 సీట్లు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కేవలం 46 సీట్లలో విజయం సాధించింది. బిజెపికి ఒటసీటు, ఇతరులకు ఎనిమిది సీట్లు దక్కాయి. స్పీకర్ ఎన్ సక్తన్ ఓటమి పాలు కావడం గమనార్హం.

చిత్రం అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ