జాతీయ వార్తలు

నరకయాతన నుంచి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఆరుషి తల్వార్ హత్య కేసులో తొమ్మిదేళ్ల పాటు సాగిన విచారణ ఫలితంగా తమ కుటుంబం నరకయాతనను అనుభవించిందని నుపుర్ తల్వార్ తండ్రి బిజి చిట్నిస్ గురువారం ఇక్కడ తెలిపారు. ఈ హత్య కేసులో తల్వార్ దంపతులను నిర్దోషులుగా ప్రకటించినందుకు ఆయన న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు నుపుర్ తల్వార్, రాజేశ్ తల్వార్‌లు నిందితులుగా ఇంతకాలం విచారణను ఎదుర్కొన్నారు. తన కుమార్తె నుపుర్ తల్వార్, ఆమె భర్త రాజేశ్‌లను జైలు గదిలో చూడటం తనకు నరకాన్ని తలపించిందని భారత వాయుసేన (ఐఎఎఫ్)లో మాజీ గ్రూప్ కెప్టెన్ అయిన బిజి చిట్నిస్ పేర్కొన్నారు. ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పిచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఈ తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థకు నా కృతజ్ఞతలు. వారు (తల్వార్ దంపతులు) నిజంగా తీవ్రంగా సతమతం అయ్యారు. ఈ వయసులో కుమార్తెను జైలులో చూడటం నాకు నరకప్రాయమయింది’ అని అన్నారు. మా కుటుంబం మొత్తం ఈ కేసు విచారణ సాగిన సుమారు దశాబ్ద కాలం పాటు అనేక ఇబ్బందులు పడిందని, నరకం అనుభవించిందని ఆరుషి మేనత్త వందన తల్వార్ పేర్కొన్నారు. ఈ కేసు, తీర్పుపై వ్యాఖ్యానించడానికి ఆమె నిరాకరించారు. వాటి గురించి తల్వార్ దంపతుల న్యాయవాది మాట్లాడతారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు ద్వారా తమకు నరకయాతన నుంచి విముక్తి కలిగించిన న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు చెబుతున్నామని ఆమె అన్నారు. 2008 మే నెలలో నుపుర్, రాజేశ్ తల్వార్ దంపతుల కుమార్తె ఆరుషి హత్యకు గురికావడం, వారి ఇంట్లో పని మనిషి హేమ్‌రాజ్ మరుసటి రోజే అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

చిత్రం..రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్