జాతీయ వార్తలు

పేదరికంపైనే నా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిన్‌సుకియా, మార్చి 26: అసోంలో బిజెపి గనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం శరవేగంగా, సర్వతోముఖంగా అభివృద్ధిచెందేలా చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, తన పోరాటం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌పై కాదని, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పెరిగి పోయిన పేదరికం, అవినీతి, విధ్వంసంపైనేనని చెప్పారు. తనకు మూడు అజెండాలున్నాయని, అవి అభివృద్ధి, శరవేగంగా అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి అని శనివారం ఇక్కడ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ మోదీ అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో రెట్లు ఎక్కువ నిధులిచ్చిందని కూడా ఆయన చెప్పుకున్నారు. అసోం ఎన్నికలు తనకు, ప్రధాని మోదీకి మధ్య ముఖాముఖి పోరాటంగా అభివర్ణించిన 79 ఏళ్ల ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌పై కూడా మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, తనకన్నా వయసులో ఎంతో పెద్ద అయిన ముఖ్యమంత్రిని తాను గౌరవిస్తానే తప్ప ఆయనతో పోటీ పడనని అన్నారు. అంతేకాదు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్బానంద సోనోవాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ తన మంత్రివర్గంలో బాగా పని చేసే మంత్రుల్లో ఆయనొకరని అన్నారు. ‘మరి కొద్ది సంవత్సరాల్లో 90 ఏళ్లకు చేరుకునే కాంగ్రెస్ నాయకుడు తన పోరాటం మోదీతోనే అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారూ, మీరు పెద్ద వారు, నేను చిన్న వాడిని. నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మన సంస్కృతిలో చిన్నవాళ్లు, పెద్ద వాళ్లతో పోరాటం చేయరు, పెద్ద వాళ్లు చిన్న వాళ్లకు తమ ఆశీస్సులు మాత్రమే ఇస్తారు. నా పోరాటం గొగోయ్‌కి వ్యతిరేకంగా కాదు, పేదరికానికి, అవినీతికి, అసోం విధ్వంసానికి వ్యతిరేకంగా మాత్రమే. నేను ఏ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడడం లేదు’ అని మోదీ అన్నారు.
సోనోవాల్ ముఖ్యమంత్రి అయితే అది తన ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా తనకు నష్టమని, ఎందుకంటే తన మంత్రివర్గంలో బాగా పని చేసే మంత్రుల్లో ఆయనొకరని, తెలివైన, సమర్థుడైన, నిరాడంబరుడైన వ్యక్తి అని ప్రధాని అన్నారు. ‘అసోంలో ఒకే ఒక ‘ఆనందం’ ఉంది, అది సర్బానంద’ అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోనే అభివృద్ధి చెందిన అయిదు రాష్ట్రాల్లో అసోం ఒకటిగా ఉండేదని, అయితే ఇప్పుడు అత్యింత వెనుకబడిన అయిదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని ఆయన అంటూ, రాష్ట్రంలో అధికారంలో ఉండిన కాంగ్రెస్ ప్రభుత్వాలే దీనికి కారణమని విమర్శించారు. మీరు గనుక నాకు, సర్బానందకు, బిజెపికి అయిదేళ్లు అవకాశమిచ్చినట్లయితే రాష్ట్రాన్ని అన్ని కష్టాలనుంచి గట్టెక్కిస్తాం’ అని మోదీ ఓటర్లకు హామీ ఇచ్చారు. తాను చిన్నతనంలో టీ అమ్మిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇతరులను ఉత్సాహవంతుల్ని చేయడం కోసం నేను మీ టీని అమ్మాను, అందువల్లే అసోం ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని అంటూ రాష్ట్ర ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు.

చిత్రం అసోంలోని తిన్‌సుకియాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ