జాతీయ వార్తలు

జీఎస్‌టీని ఉపసంహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, నవంబర్ 12: దేశ ప్రజలను ఎన్నో అవస్థలకు గురిచేస్తున్న జీఎస్‌టీని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల ప్రజలు నేటికీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు సహేతుకం కాదని ప్రభుత్వ పెద్దలకు తెలుసనీ, ఆ కారణంగానే జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్యను తగ్గించడమే దీనికి నిదర్శనమని లాలూ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ శుష్క వాగ్దానాలేనని రుజువైపోయిందని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి తరహా వాతావరణం నెలకొందని అన్నారు. నిరంకుశత్వాన్ని తలపించే రీతిలో మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. ఆలోచనా రహితంగా, సంప్రదింపులు లేకుండా పెద్దనోట్లను ఉన్నపళంగా రద్దుచేశారని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన ధ్వజమెత్తారు. నోట్లరద్దు, జీఎస్‌టీ నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, వీటి ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలవల్ల సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారని అన్నారు.
కాగా, ఆర్‌జెడి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ రిటర్నింగ్ అధికారికి లాలూ ఆదివారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశానని చెప్పారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకులు రఘువంశ్ ప్రసాద్, అబ్దుల్ బరీ సిద్దిఖీ, శివానంద్ తివారీ తదితరులు ఉన్నారు. పార్టీ నెలకొల్పినప్పటి నుంచీ పార్టీ అధ్యక్షుడుగా లాలూనే కొనసాగుతున్నారు. జాతీయ అధ్యక్షుడుగా లాలూ ప్రసాద్ ఎన్నికను ఈ నెల 21న చీఫ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై లాలూ మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సమస్యలనే తమ పార్టీకూడా ఎదుర్కొంటోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో భావసారూప్యం కలిగిన పార్టీలతో కలిసి మతశక్తులను అధికారంనుంచి పారద్రోలేందుకు ఉమ్మడిగా కృషి చేస్తామని లాలూ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న శక్తులు తనను, తన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

చిత్రం..ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా ఆదివారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన లాలూ ప్రసాద్ యాదవ్‌కు అభినందనలు తెలుపుతున్న కార్యకర్తలు