జాతీయ వార్తలు

ఇదేం ప్రజాస్వామ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం లేదని, అందుకే పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం ఏఐసీసీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఇదంతా దురుద్దేశంతో చేస్తున్నదేనని వారన్నారు. ఉపాధి కల్పన, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకే ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలకు వాయిదా వేస్తోందని ఆజాద్ విమర్శించారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి తరపున పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై చర్చ జరగాలి’అని ఆయన అన్నారు. మోదీ పరిపాలన పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలూ ఎన్నికల ప్రచారంలో తలమునకలవ్వడం విచిత్రంగా ఉందని ఆజాద్ తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ పదిహేను, ఇరవై తేదీలలో ప్రారంభం కావల్సి ఉందని అయితే ఇది జరడం లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పార్లమెంటు శీతాకాల సమావేశాల గురించి తెలుసుకునేందుకు నేను గత 24 రోజుల నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ఫోన్ చేస్తునే ఉన్నాను. అయితే ఆయనకు కూడా ఈ విషయం తెలియదు. పిఎంఓ నుంచి మంత్రికే సమాచారం లేని పరిస్థితి నెలకొంది’అని ఆజాద్ ఎద్దేవా చేశారు. ఇతర మంత్రులకు కూడా వారి శాఖల గురించి తెలియదు, అన్ని విషయాలు పిఎంఓ నుంచి రావల్సిందేనని ఆయన అన్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వ్యవస్థను కూడా దెబ్బతీయడానికి వెనకాడటం లేదని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఉపాధి కల్పనకు సంబంధించిన ఈ ఫార్ములాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించటం లేదని ఆజాద్ ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు గురించి కూడా పార్లమెంటులో చర్చ జరగాలి, జిఎస్‌టిపై కూడా సభలో పెద్దఎత్తున చర్చ జరగవలసి ఉందని అన్నారు. ప్రభుత్వం వెనకా ముందు ఆలోచించకుండా పెద్ద నోట్లను రద్దు చేసినట్లే జిఎస్‌టిని కూడా అనాలోచితంగా అమలులోకి తెచ్చిందని ఆజాద్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలోని యుపిఏ ప్రభుత్వం దేశాభివృద్ధికోసం జిఎస్‌టిని రూపొందిస్తే ఎన్‌డిఏ ప్రభుత్వం జిఎస్‌టి ద్వారా అభివృద్ధిని దెబ్బతీస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో పెరిగిన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకే ఎన్‌డిఏ పార్లమెంటు శీతాకాల సమావేశాలను సకాలంలో జరపటం లేదని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. మోదీ మాత్రం పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రధాని, కేంద్ర మంత్రులు పరిపాలనకు పక్కనబెట్టి ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారని ఆరోపించారు.
కాగా పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయమని పొగిడిన నరేంద్ర మోదీ ఇప్పుడు దానినే ధ్వంసం చేస్తున్నారని మల్లిఖార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ‘నరేంద్ర మోదీ సర్వం తానై వ్యవహరిస్తున్నారు. శీతాకాల సమావేశాల నిర్వహణ గురించి ఇతరులెవ్వరికీ సమాచారం ఇవ్వడం లేదు’ అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దేశ భద్రతతో రాజీ పడ్డారని ఆనంద్ శర్మ ఆరోపించారు.

చిత్రం..మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న
కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ