జాతీయ వార్తలు

తరలివచ్చిన అభిమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్థంతి సందర్భంగా ఇక్కడి మెరీనా బీచ్‌లో ఆమె సమాధి వద్దకు మంగళవారం ఉదయం అన్నాడిఎంకె పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వమ్ పార్టీ కార్యకర్తలతో వౌన ప్రదర్శనగా ‘అమ్మ’ సమాధి వద్దకు చేరుకున్నారు. వీరంతా నలుపు రంగు చొక్కాలను ధరించారు. అన్నాడిఎంకె బహిష్కృత నేత టిటివి దినకరన్ కూడా తన మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించి జయ సమాధి వద్దకు చేరుకున్నారు. తమిళనాడు ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రారంభించి ‘విప్లవ నాయకి’గా, ‘అమ్మ’గా ఆ రాష్ట్ర ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసిన జయలలిత అనారోగ్యంతో బాధపడుతూ గత ఏడాది డిసెంబర్ 5న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మెరీనా బీచ్‌లో జయ సమాధి వద్దకు నిత్యం ఎంతోమంది వస్తూ ‘అమ్మ’ పథకాలను, ఆమెతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
జయలలిత మరణించి అప్పుడే ఏడాది గడచిపోయిందంటూ ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. జయకు నివాళులర్పించిన తర్వాత అక్కడే ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ విగ్రహం వద్ద కూడా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ నివాళులర్పించారు. ‘అమ్మ’ ఆకాంక్షలను నెరవేర్చేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని పళని, పన్నీర్, మంత్రులు ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ సందర్భంగా ముఖ్యమంత్రి పళని స్వామి జయలలితను ఉద్దేశించి ‘అన్నాడిఎంకె శాశ్వత ప్రధాన కార్యదర్శి’ అని పేర్కొనడం గమనార్హం. భవిష్యత్‌లో కూడా తమ పార్టీని పరిరక్షించుకుంటూ ‘అమ్మ’ ఆశయాలను నెరవేరుస్తామని అన్నాడిఎంకె కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం జయ సమాధి వద్ద రెండు నిమిషాల సేపు వౌనం పాటించారు. తొలి వర్థంతి కావడంతో జయ సమాధిని సందర్శించేందుకు మెరీనా తీరానికి జనం భారీ సంఖ్యలో చేరుకున్నారు.

చిత్రాలు..జయలలిత స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వమ్ తదితరులు
*తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్థంతి సందర్భంగా
మెరీనా బీచ్‌లోని ఆమె స్మారకం వద్దకు ర్యాలీగా తరలివస్తున్న అభిమానులు