జాతీయ వార్తలు

టెంపుల్ పాలి‘ట్రిక్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, డిసెంబర్ 5: గుజరాత్‌లో మళ్లీ ఆలయ రాజకీయం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల రాజకీయం పటేల్ వర్గం సారథ్యంలోని రెండు ప్రధాన ఆలయాల చుట్టూ పరిభ్రమిస్తోంది. అందులో ఒకటి పటేదార్ వర్గంలోని లీయువా కమ్యూనిటీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకోట్ జిల్లాలోని కోదల్‌ధామ్ ఆలయం అయితే, రెండోది ఉత్తర గుజరాత్‌లోని మెహ్‌సన్ జిల్లాలో కేద్వా కమ్యూనిటీ నిర్మించిన ఉమియా ధామ్ ఆలయం. గెలుపు మార్గం సుగమం చేయగల పటేల్ వర్గంలోని రెండు ప్రధాన కమ్యూనిటీలు ఈ రెండు ఆలయాలకు ట్రస్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో, ఆయా కమ్యూనిటీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు రెండూ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. రెండేళ్ల క్రితమే నిర్మించిన ఈ రెండు ఆలయాలూ ఇప్పుడు పవర్ సెంటర్‌లుగా మారడంతో, ఈ రెండు ఆలయాల చుట్టూనే గుజరాత్ రాజకీయం తిరుగుతోందని రాజకీయ విశే్లషకుడు గౌరంగ్ జాని వ్యాఖ్యానించారు. బలాన్ని, బలగాన్ని పుణికిపుచ్చుకున్న పటేల్ వర్గంలో ప్రభావితం చేయగల ఆయా కమ్యూనిటీల వ్యక్తులను తమవైపు తిప్పుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు బిజెపి తమవంతు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయని ఆయన అంటున్నాడు. ఇదిలావుంటే, కోదల్‌దాల్ ఆలయ ట్రస్టీల్లో ఇద్దరు దినేష్ కోవాతియా, రవిభాయ్ అంబాలియాలు కాంగ్రెస్ తరఫున దక్షిణ రాజ్‌కోట్, జెట్‌పూర్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. ఇదే ఆలయానికి చెందిన మరో కీలక ట్రస్టీ గోపాల్‌భాయ్ వాస్తపర బీజేపీ తరఫున ఆమ్రేలీ జిల్లా లతి బాబ్రా సెగ్మెంట్‌నుంచి బరిలోకి దిగారు.
గుజరాత్‌లో ఆలయ రాజకీయం ఇప్పుడే మొదలైంది కాదు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోరుతూ 1990లో సోమనాథ్ ఆలయం నుంచే ఎల్‌కె అద్వానీ రథయాత్ర ఆరంభించారు. తరువాత 2002లో అయోథ్య నుంచి తిరిగొస్తున్న హిందూ యాత్రీకులు సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లో ఊచకోతకు గురైనపుడూ ఆలయ రాజకీయం తెరపైకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలయ రాజకీయమే ప్రాథాన్యత సంతరించుకుందని రాజకీయ విశే్లషకులు అంటున్నారు.
పటేదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను శ్రీ కోదల్‌ధామ్ ట్రస్ట్ చైర్మన్ నరేష్‌భాయ్ పటేల్ గతవారం కలిసి ఎన్నికల పరిస్థితిపై చర్చలు జరిపారు. ‘ఎన్నికల వాతావరణానికి సంబంధించి నరేష్‌భాయ్‌కి ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేయడంలో కృతకృత్యుడిని అయ్యా’ అని సమావేశం అనంతరం హార్దిక్ పటేల్ ప్రకటించుకుంటే, ‘పటేల్ వర్గీయుల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయన్న హార్దిక్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. కానీ, ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల విషయంలో మేం తటస్థంగానే ఉండదలచుకున్నాం’ అని కోదల్‌ధామ్ ట్రస్టీ ప్రకటించడం ఇక్కడి రాజకీయ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. అయితే, ఈ పరిణామాలపై ఓ సీనియర్ రాజకీయ విశే్లషకుడు స్పందిస్తూ ‘నరేష్‌భాయ్ ఏ రోజూ ప్రజల్లోకి రాలేదు. అయితే, ఈసారి మాత్రం హార్దిక్‌తో కలిసి మీడియాకు తన ఫొటో విడుదల చేయడానికి అంగీకరించారు. కోటా డిమాండ్ విషయంలో కోదల్‌ధామ్ ట్రస్ట్ హార్దిక్‌కు మద్దతు పలుకుతుంది. కాని, రాజకీయ విజయంతోనే కోటా సాధ్యమవుతుందని హార్దిక్ భావిస్తున్నాడు. ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. పటేల్ వర్గంలో 70శాతంగా వున్న లీయువా కమ్యూనిటీకి చెందిన నరేష్‌భాయ్ పటేల్, కోద్వా కమ్యూనిటీకి చెందిన హార్దిక్‌తో కలిసి మీడియాకు ఫొటో విడుదల చేయడం. అంటే, మొత్తంగా పరిణామాలు హార్దిక్‌కు అనుకూలించేవిగానే కనిపిస్తున్నాయి’ అంటూ విశే్లషించాడు. ‘ఈ ఒక్క పరిణామం చాలు, గుజరాత్‌లో రాజకీయ గాలులు ఎవరికి అనుకూలంగా వీస్తున్నాయో అర్థం చేసుకోవడానికి’ అంటున్నాడు మరో రాజకీయ విశే్లషకుడు హేమంత్ షా. ‘నిన్న మొన్నటి వరకూ బిజెపి అంటేనే పటేదార్ వర్గం. ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పటేదార్లలో గత రెండేళ్లుగా మార్పు కనిపిస్తోంది. రెండు ప్రధాన ఆలయాలు పవర్ సెంటర్‌లుగా మారడంతో, ఎవరి కమ్యూనిటీని వాళ్లు బలోపేతం చేసుకున్నారు. అంటే, బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రంగా పటేదార్లు అవతరించారు’ అని విశే్లషిస్తున్నాడు.
ఇదిలావుంటే, గుజరాత్‌లో నిర్వహించిన విస్తృత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని అనేక ఆలయాలను సందర్శిస్తూ, వీటినీ సందర్శించారు. ఆయా ఆలయాల ట్రస్టీలతో సమావేశమై రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన గుజరాత్ సిఎం విజయ్ రూపానీ సైతం కోదల్‌ధామ్ ఆలయాన్ని సందర్శించి ట్రస్ట్ చైర్మన్ నరేష్‌భాయ్ పటేల్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేవి ఈ రెండు ఆలయాలే. విజయాన్ని మలుపుతిప్పేవి కూడా ఈ ఆలయాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘బీజేపీ విషయంలో ఇప్పటికే గుజరాతీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపట్లా అసహనంతో ఉన్నారు. భారీఎత్తున నిధులు సమీకరించిన పటేదార్ల మాటను ఈ రెండు ఆలయాల ట్రస్టీలు జవదాటే పరిస్థితి లేదు. ఈ పరిణామాలను చూస్తుంటే, ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచోసుకునే పరిస్థితి లేకపోలేదు. అది ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం’ అని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించడం గమానార్హం. ‘ఇదొక్కటే కాదు, ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అభివృద్ధి వైఫల్యాల పట్లా అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలూ ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించకపోవు’ అని సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయానికి గుజరాత్ పరిస్థితులు అననుకూలంగా మారుతుండటంతో సిఎం విజయ్ రూపానీలో ఆందోళన మొదలైంది. ఎన్నికలను ప్రభావితం చేయగల ఈ రెండు ఆలయాల ట్రస్టీలను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ కీలక నేతలు రంగంలోకి దిగి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కేద్వా, లీయువా కమ్యూనిటీలుగా కనిపిస్తున్న పటేదార్లు, ‘పటేల్’ వర్గంగా ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది గుజరాత్ ఎన్నికల తెరపై చూడాలి.