జాతీయ వార్తలు

‘తలాక్’ ముసాయిదా బిల్లుకు యూపీ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 6: ముమ్మారు ‘తలాక్’ చెప్పి ముస్లిం పురుషులు విడాకులు తీసుకోవడాన్ని నిరోధిస్తూ కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుముఖత తెలిపింది. ఈ ముసాయిదా బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది. మూడు సార్లు ‘తలాక్’ చెప్పి అప్పటికప్పుడు విడాకులు తీసుకోవడాన్ని తీవ్రమైన నేరంగా, బెయిల్ ఇవ్వకూడని నేరంగా పరిగణిస్తూ కేంద్రం ఓ ముసాయిదా బిల్లును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు పొందే ముస్లిం పురుషుడికి మూడేళ్ల కఠిన కారాగారంతోపాటు జరిమానా కూడా విధిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో ‘తలాక్’ ముసాయిదా బిల్లును తమ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ బిల్లుపై తమ అభిప్రాయాలను ఈ నెల 10లోగా తెలియజేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ ముసాయిదా బిల్లును ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఈ బిల్లును అమలు చేసేందుకు సుముఖత తెలిపింది. ‘తలాక్’ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వక ముందు ఈ ఏడాది 177 కేసులు, తీర్పు తర్వాత 66 కేసులు నమోదైనట్లు మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు.
మూడుసార్లు తలక్ చెప్పి విడాకులు తీసుకోవడాన్ని నిషేధించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్న ఈ విధానానికి స్వస్తి పలికేలా చట్టం చేయాలని ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ముసాయిదా బిల్లు రూపొందింది. ఈ బిల్లు ప్రకారం లిఖిత పూర్వకంగా గానీ, మాటల ద్వారా గానీ, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో గాని, వాట్సాప్ ద్వారా గానీ మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం. ముస్లిం మహిళలు, వారి పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘తలాక్’ పద్ధతికి స్వస్తి పలకాలని దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళలకు చట్టపరమైన భద్రత కల్పించేందుకు కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది.