జాతీయ వార్తలు

పరిశోధనలతోనే రక్షణ రంగం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 7: పరిశోధనల ద్వారానే రక్షణ రంగం బలోపేతం అవుతుందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్‌ను రాష్టప్రతి గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. దేశం ఏ ప్రాంతంలో పనిచేస్తున్న డిఫెన్స్, మిలటరీ రంగాల్లో పనిచేస్తున్న అధికారులు ఈ యూనివర్శిటీలో కోర్సులు అభ్యసించడానికి, అలాగే పరిశోధనలు చేయడానికి వీలు కల్పించారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్శిటీ డీఆర్‌డీఓతో, నేవల్ రిసెర్చ్ బోర్డ్, ఎన్‌ఎస్‌టీఎల్‌ను సమన్వయం చేసుకుంటూ కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని కోరారు. ముఖ్యంగా మిసైల్ ప్రాజెక్ట్స్‌పై, మరీ ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణికి మరింత పదునుపెట్టేందుకు వర్శిటీ ప్రొఫెసర్లు పరిశోధనలు జరపాలని ఆయన సూచించారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉన్నందువలన, వివిధ రకాల ప్రయోగాలకు, నూతన ఆవిష్కరణలకు వర్శిటీ ఆచార్యులు, నేవీ అధికారుల సహకారాన్ని తీసుకోవాలిని రాష్టప్రతి సూచించారు. కొత్తగా ప్రారంభమైన సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, నానో టెక్నాలజీ, రాడార్ అండ్ కమ్యూనికేషన్స్, కొరిజన్ టెక్నాలజీలపై విభిన్న కోణాల్లో పరిశోధనలు చేపట్టాలని రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. డిఫెన్స్, మిలటరీ రంగాల్లో కొత్త ఆవిష్కరణ దిశగా పరిశోధనలు జరిగితే, అది దేశానికి ఎంతో మేలు చేస్తుందని రాష్టప్రతి అన్నారు. మిలటరీ, డిఫెన్స్ రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వలన మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతామని అన్నారు. కొన్ని దేశాల్లో డిఫెన్స్, రక్షణ రంగాల్లో జరిగిన అద్భుత పరిశోధనా ఫలితాలు ఆయా దేశాల అభివృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ టెక్నాలజీల వలన మానవ సమాజం కొత్త పుంతలు తొక్కిందని కోవింద్ అన్నారు. ఆంధ్రా యూనివర్శిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ విభాగాలు ఈ పరిశోధనల్లో ప్రధాన భూమికను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. వర్శిటీలో కొత్తగా ప్రారంభించిన ఈ-క్లాస్‌రూమ్ కాంప్లెక్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా దేశంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనవచ్చని రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. దేశంలో లింగ వివక్ష నేటికీ కొనసాగుతోందని కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో 40 శాతం మంది యువతులు విద్యనభ్యసించడం ఆనందదాయకమని కోవింద్ అన్నారు. వర్శిటీలోని ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రయోగశాలలను ఉపయోగించుకుని, దేశానికి ఉపయోగపడే శాస్త్ర విజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీలో చాలా మంది మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మిసైల్ ప్రోగ్రామ్, రాకెట్ లాంచర్స్ విభాగంలో మహిళలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇటీవల తాను ఆగ్రాలోని ఒక యూనివర్శిటీ స్నాతకోత్సవానికి వెళ్లినప్పుడు డీఆర్‌డీఓకు చెందిన టిస్సీ థామ్‌స్ అనే సీనియర్ మహిళా శాస్తవ్రేత్తను సన్మానించాను... ఆమెకు మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా ప్రదానం చేశాను.... నేటి మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కోవింద్ విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ ఈఎల్‌ఎస్ నర్సింహన్ మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్శిటీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని అన్నారు. ఏయూలో నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిసి గర్వపడుతున్నానని అన్నారు. ఈ వర్శిటీ ఎంతో మంది మేధావులను, మహానుభావులను దేశానికి అందించిందని అన్నారు. సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేపట్టాలని అన్నారు. రక్షణ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిశోధనలే పరిష్కార మార్గాలను చూపాలని నరసింహన్ అన్నారు.
ఈ స్టడీ సెంటర్ ఏర్పాటుతో, ఆంధ్రా యూనివర్శిటీ దేశంలోనే అగ్ర భాగాన నిలబడగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్శిటీకి మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపి హరిబాబు, వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్శిటీ తరుఫున వైస్ ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఘనంగా సత్కరించారు.
రాష్టప్రతికి ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటనకు గురువారం విశాఖ విచ్చేసిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. గురువారం మధ్యాహ్నం వాయుసేన విమానంలో ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌కు చేరుకున్నారు. రాష్టప్రతి దంపతులకు గవర్నర్ నరసింహన్ దంపతులు ముందుగా స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామ్‌నాథ్ కోవింద్‌కు శాలువ, పుష్పగుచ్ఛంతో సన్మానించి స్వాగతం పలికారు. భారత నౌకాదళ ప్రధాన అధికారి సునీల్ లాంబా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోగ్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, తూర్పు నౌకాదళ అధికారి కరంబీర్ సింగ్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. ఐఎన్‌ఎస్ డేగా లాంజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న రాష్టప్రతి దంపతులు ఆ తరువాత నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చిత్రం..విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్. చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తదితరులు.