జాతీయ వార్తలు

‘సురక్షిత స్థానం’లో రూపానీ ఎదురీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, డిసెంబర్ 7: భారతీయ జనతా పార్టీకి కంచుకోట అయిన రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్యగురు నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. గతంలో ‘రాజ్‌కోట్ రెండో నియోజకవర్గం’గా వ్యవహరింపబడిన ఈ స్థానంలో 1985 నుంచి అప్రతిహతంగా బీజేపీ విజయ పతాకాన్ని ఎగురవేస్తోంది. ఈ నెల 9న పోలింగ్ జరిగే రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది. 1985 నుంచి 2012 వరకూ వజూభాయ్ వాలా ఈ స్థానం నుంచి బిజెపి తరఫున గెలిచారు. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు వజూభాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి గెలిచాక మోదీ ఆ తర్వాత మణినగర్ నియోజకవర్గానికి మారారు. మోదీ ఒకసారి గెలిచిన అనంతరం ఈ నియోజకవర్గం నుంచి వజూభాయ్ 2012 వరకూ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయనను బీజేపీ అధినాయకత్వం కర్నాటక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపింది. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గెలుపొందారు. ఆరెస్సెస్‌కు మంచి పట్టు ఉన్న రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా రాజ్యగురును రంగంలోకి దింపింది. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి రూపానీ ఈసారి ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది. పటీదార్ సామాజిక వర్గాన్ని, వ్యాపారులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, వస్తు సేవా పన్ను (జీఎస్టీ) కారణంగా వ్యాపార వర్గాలు బీజేపీపై కొంత అసంతృప్తితో ఉన్నాయి. సుమారు 3.15 లక్షల మంది ఓటర్లున్న రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంలో కాద్వా, పటీదార్ల సామాజిక వర్గాల్లో 62వేల ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బ్రాహ్మణ, లోహనా, జైన వర్గాలున్నాయి.
పటీదార్లకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అభయం ఇచ్చింది. రూపానీ ప్రభుత్వంలో పటీదార్లకు అన్ని విధాలా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. పటీదార్లకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఇన్నాళ్లూ తమకు గట్టి మద్దతుదార్లుగా నిలచిన పటీదార్లు ఇపుడు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. గుజరాత్ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా పేరొందిన రాజ్యగురు (కాంగ్రెస్) గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రూపానీని మరో నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లనీయకుండా తాను కట్టడి చేశానని, ఇదే తన విజయానికి సూచన అని రాజ్యగురు అంటున్నారు. కాగా, కాంగ్రెస్ ఎంతగా వ్యూహరచన చేసినా తాను గెలిచి తీరతానని సిఎం రూపానీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి, తన నియోజకవర్గానికి తాను చేసిన సేవలను ఆయన గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్‌కోట్‌కు నర్మదా నదీ జలాలను తాను రప్పించానని ఆయన చెబుతున్నారు. ‘కాషాయ దళాని’కి ఆలవాలమైన రాజ్‌కోట్ పశ్చిమ స్థానం నుంచి తన గెలుపు ఖాయమంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తున్న రూపానీకి విజయం ఖాయమని బీజేపీ సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల అధికార ప్రతినిధి రాజ్ ధ్రువ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలుపెరుగని రీతిలో శ్రమించి రాజ్‌కోట్‌కు నర్మద జలాలను తీసుకొచ్చిన ఘనత రూపానీకే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీ మేరకు అయిదేళ్లలోగానే నర్మద జలాలను రాజ్‌కోట్ వాసులకు అందించడంలో ముఖ్యమంత్రి కృషి మరువలేనిదని ఆయన అన్నారు.

చిత్రం.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ