జాతీయ వార్తలు

‘అజెండా’ మారుస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్, (గుజరాత్), డిసెంబర్ 9: ఏ విషయంపైనా నిలకడ లేకుండా గుజరాత్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ పూటకో అజెండా మారుస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పఠాన్ జిల్లా హరీజ్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, మోదీ ఎప్పుడేం మాట్లాడుతారో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక మోదీ గుజరాత్ ఎన్నికలపై ఎజెండాను పదే పదే మారుస్తున్నారని అన్నారు. నర్మదా జలాలు, ఓబీసీలు, 22 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ అభివృద్ధి.. అంటూ ప్రసంగాలు చేసిన మోదీ తాజాగా కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారని రాహుల్ అన్నారు. అయితే, ప్రజలకు వాస్తవాలు చేరుతున్న తీరు ఆలోచింపజేసేదిగా ఉందని అన్నారు. నర్మదా జలాల అంశాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నికలకు వెళుతున్నామని మొదట మోదీ అన్నారని, ఆ జలాలు టాటా నానో ఫ్యాక్టరీకి తప్ప గ్రామాలకు చేరుకోలేదని రాహుల్ అన్నారు. నర్మదా జలాల తర్వాత ఓబీసీ అంశాన్ని మోదీ అందుకున్నారని, అయితే అది కూడా పనిచేయలేదని వివరించారు. మరికొద్ది రోజులకు ‘22 ఏళ్ల అభివృద్ధి’ని చూపుతూ ఓట్లు అడుగుతామని మోదీ అన్నారని, ఆ మాటను కూడా పక్కనపెట్టి, ఇపుడు మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ఎన్నికల అంశంగా ప్రస్తావించారని కాంగ్రెస్ యువనేత విమర్శించారు.
కాగా, మోదీ ప్రభుత్వం పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలకు 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తేలిందని, తన ప్రతిష్టను పెంచుకునేందుకు ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించడం తగునా? అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ డబ్బును ఆరోగ్యం, విద్యకోసం ఖర్చు చేస్తుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా అక్రమ సంపాదన గురించి తాను ఎంతగా ప్రశ్నించినా మోదీ స్పందించడం లేదన్నారు. గుజరాత్‌లో మోదీ సుమారు 200 ప్రసంగాలు చేసినా ఎక్కడా అవినీతి గురించి ప్రస్తావించలేదన్నారు. ఈ ఎన్నికలు మోదీ కోసమో, రాహుల్ కోసమో కాదని గుజరాత్ ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించడానికి అని ఆయన అన్నారు. 22 ఏళ్ల బీజేపీ పాలన అతి కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు మేలు చేసిందని, రైతుల నుంచి భూములు లాక్కుని టాటా నానో వంటి ఫ్యాక్టరీలకు అప్పగించారని అన్నారు. ఉపాధి హామీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలను కేటాయించగా, బిజెపి సర్కారు టాటా నానో ఫ్యాక్టరీకి 33,000 కోట్లు ఇచ్చిందన్నారు. ప్రజలకు పగటిపూట విద్యుత్ లేకున్నా, ఈ ఫ్యాక్టరీకి రోజంతా విద్యుత్ అందుతోందన్నారు. గుజరాత్‌లో తమ పార్టీని గెలిపిస్తే వౌలిక సౌకర్యాలు, రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తామన్నారు. నోట్లరద్దు, జిఎస్టీపై సమాధానాలు చెప్పలేకే పార్లమెంటు శీతాకాల సమావేశాలను మోదీ వాయిదా వేయించారని ఆరోపించారు.
అభివృద్ధి ఊసే లేదు
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. గుజరాత్ అభివృద్ధికి సంబంధించి మోదీకి తాను పది ప్రశ్నలు సంధించినా ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘గుజరాత్‌లో ఇరవై రెండేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.. అయితే మోదీ ప్రసంగాల్లో అభివృద్ధి అనే మాట ఎందుకు వినిపించడం లేదు? తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసేవరకూ మేనిఫెస్టోను ఎందుకు విడుదల చేయలేదు?’- అని రాహుల్ ట్విట్టర్‌లో నిలదీశారు. సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని తాను రోజుకో ప్రశ్న వేసినా మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ‘గుజరాత్ నమూనా’ అంటూ గొప్పలు చెప్పుకునే మోదీ ఆ రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడడం లేదని రాహుల్ ప్రశ్నించారు. కాగా, గుజరాత్‌లో తొలి దశ పోలింగ్‌కు యువ ఓటర్లు భారీగా తరలివచ్చి ‘ప్రజాస్వామ్య పండుగ’ను ఘనంగా జరిపారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం వల్లే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు.

చిత్రం..గుజరాత్‌లోని ఆనంద్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఓ ఓటరుతో రాహుల్