జాతీయ వార్తలు

చెప్పుకోడానికి ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాకోర్ (గుజరాత్), డిసెంబర్ 10: అభివృద్ధి అజెండాను వల్లెవేయడం, తన గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసేదేమిటని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకో ప్రశ్నతో ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న రాహుల్, మలి దశ ఎన్నికల ప్రచారంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆదివారం రాంచోడ్ రైజీ మందిర్‌లో కృష్ణుడిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ ఎన్నికల గాలి మాటలు చెప్పుకొచ్చిన మోదీకి, ఇక చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు’ అని ఎద్దేవా చేశారు. ‘బిజెపి తన ఎన్నికల ప్రచారాన్ని నర్మద జలాల నుంచి మొదలు పెడితే, నాలుగైదు రోజులకే ఆ జలాలు తమకందడం లేదని జనం తిప్పికొట్టారు’ అని అన్నారు. దీంతో అయోమయానికి గురైన బిజెపి మాట మార్చిందని, ఎన్నికలు జరిగేది నర్మద కోసం కాదు బీసీల కోసమంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. బీజేపీ వల్ల మాకు ఒరిగిందేమీ లేదంటూ బీసీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో, ఐదారు రోజులకే మళ్లీ కొత్త టర్న్ తీసుకుని ఇప్పుడు 22 పాలనా అభివృద్ధి యాత్ర అని మోదీ ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘మోదీజీ నిన్న మీ ప్రసంగం విన్నాను. అందులో 90 శాతం స్వోత్కర్షలు తప్ప విషయం లేదు. మీ ఎన్నికల ప్రసంగాల్లో తొలుత రైట్ టర్న్ తీసుకున్నారు. తరువాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. ఇంకే టర్న్ తీసుకోడానికి అవకాశం లేక బ్రేకులు వేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మీకోసమో, నాకోసమో కాదు. బీజేపీ కోసమో కాంగ్రెస్ కోసమో అస్సలు కాదు. ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం. ఆ విషయం మీకు తెలియకపోయినా, ప్రజలకు తెలుసు’ అంటూ రాహుల్ గాంధీ చురకలు వేశారు. మలిదశ ఎన్నికల ప్రచారంలో మరింత వాడి పెంచిన రాహుల్, రాష్ట్రంలో చోటుచేసుకున్న అవినీతిపై ఎందుకు పెదవి వివ్పడం లేదంటూ నిలదీశారు. ‘గుజరాత్ మొత్తం ఆందోళనలతో రగులుతోంది. అటు పటేదార్లు, ఇటు దళితులు, మరోపక్క అంగన్‌వాడీలు.. చివరకు సామాజిక వర్గాలూ ఆందోళనలకు దిగుతున్నాయి. వీటిపై మీరెందుకు మాట్లాడరు. వాళ్లకు ఎందుకు సమాధానం చెప్పరు’ అంటూ నిలదీశారు. ఘాటైన వ్యాఖ్యలతో బీజేపీపై విరుచుకుపడుతూనే, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలకు దిగొద్దంటూ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ‘ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయకండి. ఆయన ఎంత తియ్యటి కబుర్లు చెప్పినా, బీజేపీ ఓటమి ఖాయం’ అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. బీజేపీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ వంటి విధానాలు దొంగలను దొరలను చేసిందని, బ్లాక్‌మనీ వైట్ చేసుకోవడానికి ఉపకరించిందంటూ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు.

చిత్రం..గుజరాత్‌లోని రాంచోడ్ రైజీ మందిర్‌లో కృష్ణుడిని దర్శించుకున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ