జాతీయ వార్తలు

గుజరాత్‌పై మాట్లాడరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థరాడ్ (గుజరాత్), డిసెంబర్ 11: పాకిస్తాన్, చైనా, ఆఫ్గానిస్తాన్, జపాన్ కబుర్లు చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రసంగాల్లో గుజరాత్ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించనున్న రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తన వాగ్బాణాలతో మోదీపై దండెత్తుతున్న రాహుల్, సోమవారం నాటి ర్యాలీల్లోనూ పలు ప్రశ్నలు సంధించారు. ‘కంపెనీ’పైనా పెదవి విప్పరెందుకు? అని చలోక్తి ప్రశ్న విసురుతూనే, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు కంపెనీలో పెట్టుబడులు అమాంతం పెరిగిన వ్యవహారాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ అసలు విషయం గురించి మాట్లాడకుండా, ప్రపంచ ప్రస్తావన తేవడం వెనుక కారణం, గుజరాత్ అభివృద్ధిపై ఏం మాట్లాడలేని పరిస్థితేనంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారాల్లో రోజుకోమాట చెబుతున్న మోదీ, ఓటమి భయంతో నిలకడలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని దుమ్మెత్తిపోశారు. తొలుత నర్మద జలాలు ప్రస్తావించారని, ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో ఓబీసీ అంశాన్ని పట్టుకున్నారన్నారు. ఆయా వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఇప్పుడు పాక్, చైనా, ఆఫ్గాన్ అంటూ కొత్త కబుర్లు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. ‘మోదీజీ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలపైనే గుజరాత్ భవిష్యత్ ఆధారపడి ఉంది. గుజరాత్ అభివృద్ధికి ఏం చేయబోతున్నారో రెండు ముక్కలైనా చెప్పండి. ప్రజలు సంతోషిస్తారు’ అంటూ బనస్కాంత జిల్లాలో నిర్వహించిన కిక్కిరిసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో వ్యంగ్య బాణాలు విసిరారు. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటోందని, తనను తప్పించేందుకు పాక్‌తో మణిశంకర్ అయ్యర్ కుట్రపన్నారన్న మోదీ ప్రస్తావనలను ఉటంకిస్తూ ‘కొద్ది రోజులుగా మోదీజీ ఎన్నికల ప్రసంగాలను గమనిస్తున్నాను. అసలు విషయాన్ని వదిలేసి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో సగం సమయం కాంగ్రెస్‌ను దేశంనుంచి తుడిచేయడానికి ఏం చేయాలో చెప్పడమే సరిపోతుంది. మిగిలిన సమయం ఆయన గురించి ఆయన చెప్పుకోడానికీ సరిపోతుంది’ అంటూ అభిమానుల హర్షధ్వానాల మధ్య చలోక్తి విసిరారు. ‘మోదీజీ, మీరు వెచ్చిస్తున్న ఎన్నికల ప్రచార సమయంలో కనీసం రెండు నిమిషాలు గుజరాత్‌కు ఏం చేయబోతున్నారో చెప్పండి. ప్రజలు ధన్యులవుతారు’ అంటూ చమత్కరించారు. ‘మీరు గమనించండి. ఆయన దేశంలో అవినీతి గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే, అవినీతిని ప్రస్తావిస్తే బీజేపీ అధ్యక్షుడి కొడుకు జై షా కంపెనీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. 50 వేల పెట్టుబడితో మొదలైన కంపెనీ, మూడు నెలల్లో 80 కోట్లకు ఎలా ఎదిగిందో వివరించాల్సి వస్తుంది. అందుకే మోదీజీ నోటివెంట అవినీతిపై ఒక్కముక్క కూడా బయటకు రావడం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, అధికారంలోకి వచ్చిన కేవలం పది రోజుల్లో రైతు రుణాల మాఫీని అమలు చేస్తుందని రాహుల్ ఉద్ఘాటించారు. దేశంలో అత్యంత ధనవంతులైన పదిమందికి 1.3 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిన మోదీ ప్రభుత్వం, రైతు రుణాల మాఫీని ప్రకటించడానికి వెనుకంజ వేస్తోందని ఆగ్రహించారు. రుణ మాఫీని రైతులు ప్రశ్నిస్తున్న ప్రతిసారీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని నరేంద్ర మోదీలు.. అది మా విధానం కాదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ‘రుణ మాఫీ ఎందుకు చేయరు?’ అని ప్రశ్నిస్తూనే, ‘ఎందుకంటే రైతులు విమానాల్లో తిరగలేరు. పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించలేరు. 15 లక్షల రూపాయల విలువ చేసే సూట్లు ధరించలేరు. అందుకే, ఎన్డీయే దృష్టిలో వాళ్లు రుణ మాఫీకి అనర్హులు’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఎంఎన్‌ఆర్‌ఇజిఏ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం 35వేల కోట్లు కేటాయిస్తే, బీజేపీ ప్రభుత్వం టాటా నానో ఫ్యాక్టరీకి 33వేల కోట్లు ఇచ్చింది. నేరుగా ఫ్యాక్టరీకి నర్మద జలాలు తరలించుకోడానికి అనుమతిచ్చింది. గుజరాత్ ప్రజలకు ఒక్క రాత్రైనా సక్రమంగా విద్యుత్ రాకపోవచ్చేమోగానీ, నానో ఫ్యాక్టరీకి ఒక్క క్షణం కూడా విద్యుత్ ఆపకుండా సరఫరా చేస్తోంది’ అంటూ ధ్వజమెత్తారు. ముంద్ర చుట్టుపక్కల ప్రాంతాలను స్క్వేర్ మీటర్ ఒక్క రూపాయి చొప్పున ఆదాని గ్రూప్‌కు అప్పగించిన ప్రభుత్వం, ఆ తరువాత స్క్వేర్ మీటర్ మూడు వేలకు అమ్ముకుంటున్న వైనాన్ని గమనించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో గుక్క తిప్పుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ వాగ్బాణాలు సంధించారు.