జాతీయ వార్తలు

గుజరాత్‌లో ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గుజరాత్‌లో అధికారంకోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గత 49రోజుల నుండి కొనసాగుతున్న ప్రచార యుద్ధం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ గురువారం జరగనుంది. ఎన్నికలకు సంబంధించిన రెండోదశ ప్రచారం ముగియటంతోపాటు ఇప్పుడు అందరి దృష్టీ ఓటర్లపైకి మళ్లింది. మొదటి దశ ఎన్నికల్లో దాదాపు 70 శాతం పోలింగ్ జరగటం తెలిసిందే. రెండో దశలో ఎంత పోలింగ్ అవుతుందనేది వేచిచూడాల్సిందే. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసుకున్నారు. పటేదార్ సంఘం అధ్యక్షుడు హార్దిక్ పటేల్‌కు సంబంధించిన సెక్స్ వీడియోలు ఎన్నికల ప్రచారంలో వేడి నింపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోదీ ఆఖరు రోజున సీప్లేన్‌లో ఎగిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. నరేంద్ర మోదీ సాబర్‌మతీ నదిపై సీప్లేన్‌లో తిరగటంద్వారా ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. మోదీ చేసిన ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఇతర పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ప్రధాన మంత్రి భద్రతను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదట్లో మామూలుగానే ఉన్నా సమయం గడిచిన కొద్దీ విమర్శలు వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రధాన మంత్రిని నీచుడుగా అభివర్ణించటం అత్యంత వివాదాస్పదంగా మారింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ ఎంతో ఎదిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తన భుజాలపై మోసిన రాహుల్ సూటిపోటి మాటలతో నరేంద్ర మోదీని ఎప్పటికప్పుడు దుయ్యబట్టారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదంటూ రోజువారీ ప్రశ్నల ద్వారా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. గుజరాత్‌లో బీజేపీకి ఎదురులేదనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేయటంలో రాహుల్ గాంధీ విజయం సాధించారు. 22ఏళ్ల పాలనలో బీజేపీ ప్రచారం తప్ప అభివృద్ధి సాధించలేదంటూ ఆయన లెక్కలతోసహా చూపించారు. ముఖ్యంగా గుజరాత్‌లో విద్యారంగం వెనుకబడిపోయిందని, బీజేపీ ప్రభుత్వం ఎందుకింత తక్కువ నిధులు ఖర్చు చేసిందంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మెతక హిందూత్వ విధానాన్ని అవలంభించటం ద్వారా బీజేపీ మతపరమైన ప్రచారానికి అడ్డుకట్ట వేయగలిగారు. ఆయన కనిపించిన ప్రతి గుడికీ వెళ్లటంద్వారా హిందువుల సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నించారు. నరేంద్ర మోదీ మొదట్లో అభివృద్ధి గురించి మాట్లాడినా ఆ తరువాత కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా రాజకీయం చేశారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ఆరోపణను ప్రజల వద్దకు తీసుకుపోయారు. కాంగ్రెస్‌కు మీరే బుద్ధి చెప్పాలంటూ ఓటర్లను రెచ్చగొట్టారు. రాహుల్ ప్రచారంతో కొంత ఖంగుతిన్న మోదీ తనను హత్య చేసేందుకు మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్‌కు చెందిన సంఘ వ్యతిరేక శక్తులకు సుపారీ ఇచ్చారని ఆరోపించి అందరిని ఆశ్చర్యపరిచారు. గుజరాత్ ఎన్నికలపట్ల పాకిస్తాన్ ఎందుకంత చొరవ తీసుకుంటోందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు పాకిస్తానీయులతో చేతులు కలుపుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. మోదీ చేసిన ఈ ఆరోపణలను ఖండించేందుకు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రంగంలోకి రావాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ గుజరాత్ ఓటర్లను ఆకర్షించేందుకు వేయవలసిన ఎత్తుగడలన్నీ వేశారు. ఈ విమర్శలు, ప్రతివిమర్శలు గుజరాత్ ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేశాయనేది ఈ నెల 18న జరగనున్న ఓట్ల లెక్కింపుతో వెలుగులోకి వస్తుంది.

చిత్రాలు.. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం అహ్మదాబాద్ ఎయర్ పోర్టు వద్ద అమరవీరుడైన ఆర్మీ జవాను అశోక్ తాడ్వి కుమార్తె రూపాల్‌తో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పోలీసులు రూపాల్‌పై చేయచేసుకున్నారు.
* బనస్కాంత జిల్లాలో అంబాజీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం స్థానికులతో కరచాలనం చేస్తున ప్రధాని నరేంద్ర మోదీ