జాతీయ వార్తలు

వేడెక్కనున్న శీతాకాలం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలపై చర్చించేందుకు వచ్చే గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశాలు వచ్చే శుక్రవారం అంటే ఈ నెల 15న ప్రారంభమై, జనవరి ఐదోతేదీన ముగుస్తాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల దృష్టా పార్లమెంటు సమావేశాలను నవంబర్ మూడోవారంలో కాకుండా డిసెంబర్ పదిహేనో తేదీన ప్రారంభిస్తోంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే మోదీ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలను వాయిదా వేసిందని ప్రతిపక్షాలు ఆరోపించటం తెలిసిందే. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎప్పటిమాదిరిగానే నవంబర్ మూడోవారంలో ప్రారంభమై పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ గురించి చర్చ జరిగితే, దానివలన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో దెబ్బతగులుతుందనే భయంతోనే మోదీ ప్రభుత్వం వీటిని వాయిదా వేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం ప్రభుత్వంపై పెద్దఎత్తున విరుచుకుపడే అవకాశం ఉంది. ప్రతిపక్షం ఈ అంశాన్ని పార్లమెంటులో ఎలాగూ ప్రస్తావిస్తుంది. అయితే అంతకుముందు జరిగే సమావేశంలోనూ ఈ ఆంశాలను ప్రస్తావించాలని ప్రతిపక్షం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలను సజావుగా కొనసాగించేందుకు తోడ్పడాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేయటం ఒక ఆనవాయితీ. అయితే ప్రభుత్వం తప్పొప్పులను ప్రజల ముందు పెట్టాలనుకునే ప్రతిపక్షం సమావేశాలను ఎలాగూ సజావుగా కొనసాగనివ్వదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వంతో సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, వెనుకబడిన కులాల కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచేందుకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో పెట్టే సూచనలు కనిపించటం లేదు. ఈ సమావేశాల్లో ప్రతిపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల జాబితాలో తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు లేదు. దానికి సంబంధించిన ప్రస్తావన గురించి కూడా ప్రభుత్వం ఆలోచించటం లేదని చెబుతున్నారు.