జాతీయ వార్తలు

కోలాహలంగా రాహుల్ పట్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఒకప్పుడు అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చిన యువనేత రాహుల్ గాంధీ ఇపుడు ‘శతాధిక’ కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని స్వీకరించారు. వారసత్వంగా తాను కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించలేదని, 132 ఏళ్ల పురాతన పార్టీలో తరాల మార్పు క్రమంలో కొత్త బాధ్యతలను తీసుకున్నానని రాహుల్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆయన శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాహుల్ పట్ట్భాషేకం సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం పండుగ వాతావారణం నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో కొన్ని గంటల సేపు కోలాహలం కొనసాగింది. కార్యాలయం వద్ద కార్యకర్తలు రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్‌లో నూతన శకం ఆరంభమైంది. తన తల్లి సోనియా గాంధీ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. సోనియా 19 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
మారిన రాహుల్ వైఖరి..
చాలాకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోలేక పోయిన రాహుల్ గాంధీ వైఖరిలో ఇటీవల ఆశాజనకమైన మార్పు వచ్చిందని కాంగ్రెస్ నేతలు సంతోషపడుతున్నారు. రాహుల్ వ్యవహార శైలిలో మార్పు కారణంగా ఇక కాంగ్రెస్‌కు మంచి రోజులొస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీకి దీటుగా రాహుల్ ప్రచారం చేశారని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా పరిణతి చూపుతున్న రాహుల్ వల్ల పార్టీకి పునరుత్తేజం ఖాయమని వారు భావిస్తున్నారు. వస్తధ్రారణలో గాని, హావభావాల ప్రదర్శనలో గాని గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తున్న రాహుల్ ‘తాను మారానని’ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అమేథీ ఎంపీగా ఉంటున్న ఈ 47 ఏళ్ల నేత వల్ల గుజరాత్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మోదీ ప్రవేశపెట్టిన జీఎస్‌టీని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని, కేంద్రంలో ‘సూటు బూటు సర్కారు’ ఉందని రాహుల్ వాగ్బాణాలు సంధించడం అందరినీ ఆకట్టుకుంది. ‘మోదీకి రోజుకో ప్రశ్న’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన ఆయన బీజేపీకి ఇటీవల తన దూకుడును పెంచారు. కాంగ్రెస్‌కు జవసత్వాలను అందించడంలో ఆయన విజయం సాధిస్తారని ఆ పార్టీలోని నేతలు భావిస్తున్నారు. అయితే, యువతరం సాయంతో తాను సంప్రదాయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన భరోసా ఇస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీకి 17వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ 2004లో తొలిసారి అమేథీ నుంచి ఎంపీగా గెలిచాక పార్టీలో ఆశాకిరణంగా మారారు. పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆయన పలు సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించారు. ఆయన ఏది చేసినా, చేయకపోయినా రాజకీయ వారసత్వం కారణంగా వార్తల్లో నిలిచేవారు. తన తల్లి సోనియా 19 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించాక, ఇపుడు ఆ బాధ్యతలను మోయడం యువనేతకు సవాల్ వంటిదని పరిశీలకులు భావిస్తున్నారు. 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2013లో ఉపాధ్యక్షుడిగా ఆయన పదవులను చేపట్టారు. రాజకీయ వారసత్వం ఉన్నందున ఆయనకు కాంగ్రెస్‌లో పదవులు, ప్రాముఖ్యత సులభంగానే లభించాయి. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ హత్యలకు గురికావడంతో రాజకీయాల పట్ల సుముఖత చూపని రాహుల్ అనివార్యంగా పదవులను చేపట్టవలసి వచ్చింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో, ఆ తర్వాత ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో విద్య అభ్యసించిన రాహు ల్ లండన్‌లోని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ‘మోనిటర్ గ్రూపు’లో మూడేళ్లు పనిచేశారు.
ఆ తర్వాత స్వదేశానికి చేరుకున్నాక రాజకీయాల్లో చేరాల్సి వచ్చింది. అనేక ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారం చేసినా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. 2013లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పలు రాష్ట్రాల్లో క్రమంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతూ వచ్చిం ది. అయితే, అనుభవం నేర్పిన పాఠాలతో ఆయన వైఖరిలో ఇపుడు ప్రస్ఫుటమైన మార్పు వచ్చిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
పార్టీలో రాహుల్ సరికొత్త చరిత్రను సృష్టించి, పార్టీకి గత వైభవాన్ని తెస్తారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు తమకు ఆశాజనకంగా ఉంటే రాహుల్‌కు ఇక ఎదురే ఉండదని పార్టీ నేతలు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించడమే రాహుల్ ముందున్న ప్రధాన సవాల్ అని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభావం తగ్గుతోందని, ఈ పరిణామాలు రాహుల్ నాయకత్వానికి బలం చేకూర్చుతాయని వారు అంచనా వేస్తున్నారు. రాహుల్ ఇక పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తే తమకు రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఖాయమని కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ అంటున్నారు.

చిత్రాలు..కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని ఎన్. రామచంద్రన్ నుంచి అందుకుంటున్న రాహుల్‌గాంధీ. చిత్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ వున్నారు
* కాంగ్రెస్ పార్టీ నేతలతో ముచ్చటిస్తున్న ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా