జాతీయ వార్తలు

మహారాష్ట్ర బంద్..పలుచోట్ల హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: భీమా-కొరెగావ్ యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా చెలరేగిన హింసకు నిరసనగా బుధవారం జరిగిన మహారాష్ట్ర బంద్‌లో అక్కడక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. భారిపా బహుజన్ మహాసంఘ్ నేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు మేరకు మహారాష్ట్ర బంద్ జరిగింది. రెండు రోజుల క్రితం పూణె జిల్లాలోని భీమా కొరెగావ్‌లో దళితులపై దాడులను నివారించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు నిరసనగా బంద్ పాటించాలని ప్రకాశ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. ముంబయిలో ఆందోళనకారులు సిటీ బస్సులను, లోకల్ రైళ్లను అడ్డుకోవడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని చెంబూరు, ఘట్కోపర్, కామరాజ్ నగర్, విఖ్రోలీ, డిండోషి, కండివలి, జోగేశ్వరి, కళానగర్, మహిమ్ ప్రాంతాల్లో దళితులు నిరసన ప్రదర్శనలు జరిపారని పోలీసులు తెలిపారు. వందలాది మంది ఆందోళనకారులు పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధం చేశారు. ఆ తర్వాత పోలీసుల జోక్యం చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించారు. హార్బర్‌లైన్ తదితర ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. అనంతరం వారు గోవండి, మన్‌ఖుర్ద్, కుర్లా తదితర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌పై బైఠాయించి సబర్బన్ రైళ్లను అడ్డుకున్నారు. పనె్వల్, బేలాపూర్, వషీ తదితర ప్రాంతాల్లో కొన్ని గంటల సేపు లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. థానే, భండుప్, కంజుర్‌మార్గ్, విఖ్రోలీ, ఘట్కోపర్ స్టేషన్లలో రైళ్ల కోసం ప్రయాణీకులు బారులు తీరారు. నల్లసొపర స్టేషన్‌లోనూ నిరసనకారులు రైళ్లను అడ్డుకున్నారు. బాండ్రా, ధారవి, కామరాజ్ నగర్, సంతోష్‌నగర్, డిండోషి, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో 13 బస్సులకు ఆందోళనకారులు నష్టం కలిగించారని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
పలు రైళ్లకు అంతరాయం కలగడంతో ముంబయిలో ప్రఖ్యాతి చెందిన ‘డబ్బావాలాల’ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా తాము బస్సులను రద్దు చేశామని స్కూల్ బస్ ఆపరేటర్ల సంఘం ప్రకటించింది. థానే, గొరెగావ్ ప్రాంతాల్లో దళిత ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లను తొలగించారు. హింసాత్మక సంఘటనలకు సంబంధించి నగర పోలీసులు 9 కేసులను నమోదు చేశారు. పూణెలో బస్సులపై రాళ్లు రువ్విన సంఘటనలు ఒకటీ అరా జరిగినా మొత్తానికి బంద్ ప్రశాంతంగానే కొనసాగింది. గత రెండురోజులుగా ఆందోళనకారులు 42 బస్సులకు నష్టం కలిగించారని పూణె మహానగర్ పరివాహన్ మహామండల్ తెలిపింది. భీమా కొరెగావ్‌లో హింసకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలింద్ ఎక్బోటే ఇంటిపైకి దండెత్తేందుకు నిరసనకారులు యత్నించారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భీమా కొరెగావ్ యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా పూణెలోని శనివార్ వాడలో జరిగిన కార్యక్రమంలో జిగ్నేశ్, ఖలీద్‌లు పాల్గొని మరో వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని పోలీసులు తెలిపారు.