జాతీయ వార్తలు

సుప్రీంలో తిరుగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశ న్యాయవ్యవస్థలో ఇదో అనూహ్యమైన, దిగ్భ్రాంతికరమైన పరిణామం. ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా దేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తులే ప్రధాన న్యాయమూర్తిగా ధ్వజమెత్తారు. దాదాపుగా తిరుగుబాటు చేసినంత పనీ చేశారు. దేశ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు శుక్రవారం మీడియా సాక్షిగా తమ అక్కసు వెళ్లగక్కారు. కేసుల కేటాయింపు వివక్షాయుతంగా ఉందని ఆరోపించడమే కాకుండా కొన్ని న్యాయస్థానాల తీర్పులపై కూడా విమర్శలు గుప్పించారు. నలుగురు సీనియర్ న్యాయవాదులు ఈ రకంగా ప్రధాన న్యాయమూర్తిపైనే బహిరంగంగా ధ్వజమెత్తడమన్నది సర్వత్రా ప్రకంపనలు పుట్టించింది. ఇటు న్యాయవ్యవస్థలోనూ, అటు రాజకీయ వ్యవస్థలో కూడా అలజడి రేపింది. జస్టిస్ చలమేశ్వర్ సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఇలా మీడియా భేటీ నిర్వహించడాన్ని బట్టి చూస్తే దేశ ప్రధాన న్యాయమూర్తికి వారికి మధ్య రగులుకుంటున్న విభేదాల తీవ్రత స్పష్టమైంది. 25మంది సభ్యులు గల సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ జె.చలమేశ్వర్ కొనసాగుతున్నారు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడమే దేశ న్యాయవ్యవస్థలో అసాధారణ పరిణామంగా అభివర్ణించిన జస్టిస్ జలమేశ్వర్ ‘‘సుప్రీంకోర్టు వ్యవహారాల నిర్వహణలో ఓ పద్ధతి అంటూ లేని పరిస్థితి తలెత్తింది. గత కొన్ని నెలలుగా ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి’’ అని అన్నారు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పనితీరుపైనే
తీవ్ర ప్రభావం చూపించిన అంశాలపై దిద్దుబాటు చర్యలను చీఫ్ జస్టిస్ మిశ్రా తీసుకోవడం లేదని ఆరోపించారు. తక్షణ ప్రాతిపదికన న్యాయవ్యవస్థను, దాని పవిత్రతను పరిరక్షించుకోకపోతే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించే అవకాశమే లేదని ఆయన అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో న్యాయమూర్తులు ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి తమ విభేదాలను బహిరంగపర్చడమన్నది ఇదే మొదటిసారి. ఈ పరిణామం కారణంగా అనేక సమాధానం లేని ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. న్యాయమూర్తులే తమ విభేదాలను వీధికెక్కించిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆందోళన మొదలైంది. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడిన ఈ మీడియా సమావేశంలో జస్టిస్ రంజన్ గగోయ్, ఎం.బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లు పాల్గొన్నారు. తాము శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తిని కలుసుకుని ఈ అత్యున్నత న్యాయవ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించామని చలమేశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతమున్న కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. ఉన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తులను ఈ కొలీజియమే ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం విభేదాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించడమన్నది తమకు ఎంతో బాధాకరంగా ఉందని చలమేశ్వర్ అన్నారు. ఈ నలుగురు న్యాయమూర్తులు కూడా కొన్ని అంశాలకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తిని ఒప్పించడంలో విఫలమయ్యారని తెలిపారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను కలిసి తాము అన్ని అంశాలను చర్చించామని, తక్షణ ప్రాతిపదికన నివారణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామని తెలిపారు. కానీ తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందన్న అభిప్రాయానికి రాక తప్పలేదన్నారు. అసలు ఈ అంశాలేమిటన్న ప్రశ్నకు జవాబిచ్చిన చలమేశ్వర్ ‘‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేటాయిస్తున్న కేసుల వ్యవహారం సహా చాలా ఉన్నాయి’’ అని జవాబిచ్చారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి.హెచ్.లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన కేసును సుప్రీంకోర్టు విచారణకు ఈ రోజే చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సోహ్రాబుద్దీన్ షేక్‌కు శిక్ష విధించిన అంశాన్ని సీబీఐ న్యాయమూర్తి బి.హెచ్.లోయా విచారిస్తున్న విషయం గమనార్హం. ఇటు సుప్రీంకోర్టుకు, అటు జాతికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం న్యాయమూర్తులకు ఉందని పేర్కొన్న చలమేశ్వర్ ఈ అత్యున్నత వ్యవస్థను పరిరక్షించే విషయంలో ప్రధాన న్యాయమూర్తిని తాము ఒప్పించలేకపోయామన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వాస్తవాలను వెల్లడించడానికి తాము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశామన్నారు. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలని ఈ నలుగురు న్యాయమూర్తులు భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ‘‘దీనిపై దేశమే నిర్ణయం తీసుకోవాలి’’ అని బదులిచ్చారు.

చిత్రాలు...సుప్రీంకోర్టు
*మీడియా సమావేశంలో సీనియర్ న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, రంజన్ గగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసఫ్