జాతీయ వార్తలు

అత్యున్నత స్థాయి విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకుర్ చేసిన ఆరోపణల వ్యవహారం రాజకీయ రంగు పలుముకుంది. నలుగురు న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలు చాలా తీవ్రమైనవి, వీటిపై అత్యున్నత స్థాయిలో విచారణ జరగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి ఏ.ఐ.సి.సి కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. నలుగురు న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలు చాలా ముఖ్యమైనవి, వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి, న్యాయమూర్తి లోయా మరణంపై సుప్రీం కోర్టుకు చెందిన ప్రత్యేక విచారణ సంఘం ద్వారా దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నలుగురు న్యాయమూర్తుల ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే ఒక ప్రకటన చేసింది, అయితే విషయం అత్యంత తీవ్రమైంది కాబట్టి దీనిపై తాను కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడికి వచ్చానని రాహుల్ గాంధీ విలేఖరులతో చెప్పారు. ‘నలుగురు న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలు అత్యంత ముఖ్యమైనవి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకు వస్తోందని నలుగురు న్యాయమూర్తులు హెచ్చరించారు, ఈ అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది, న్యాయమూర్తి లోయ మరణం గురించి కూడా నలుగురు న్యాయమూర్తులు కొన్ని విషయాలు వెల్లడించారు, దీనిపై సరైన పద్ధతిలో విచారణ జరగవలసి ఉన్నది, సుప్రీం కోర్టుకు చెందిన అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా దర్యాప్తు జరపవలసి ఉన్నది, నలుగురు న్యాయమూర్తులు ఇలా మాట్లాడటం గతంలో ఎప్పుడు జరగలేదు, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు, నలుగురు న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను న్యాయాన్ని కోరుకునే వారు, సుప్రీం కోర్టు పట్ల విశ్వాసం ఉన్నవారు జాగ్రత్తగా చూస్తున్నారు’ అని రాహుల్ గాంధీ సూచించారు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవనేది మరిచిపోరాదని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తి లోయా మరణంపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తుల చేత దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మొదట కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా విలేకరులతో మాట్లాడుతూ న్యాయమూర్తి లోయా మరణంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తి లోయ మరణంపై నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అనుమానం వ్యక్తం చేసినందున దీనిపై వెంటనే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరగవలసిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తులకు కోర్టు కేసులు కేటాయించే అంశంపై సుప్రీం కోర్టు నియమ, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సుర్జేవాల్ ప్రతిపాదించారు. కొందరు ఎంపిక చేసిన న్యాయమూర్తులకు మాత్రమే కొన్ని కేసులను కేటాయించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలన, ప్రజలపై చెరగని ముద్ర వేసే కేసుల విచారణ సుప్రీం కోర్టుకు చెందిన అత్యంత సీనియర్ న్యాయమూర్తుల కోర్టుల్లో జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సి.పి.ఐ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి.రాజా అంతకు ముందు న్యాయమూర్తి చలమేశ్వర్ నివాసానికి వెళ్లి ఆయనతో కొద్ది సేపు చర్చలు జరపటం గమనార్హం.
ప్రమాద సంకేతం: విపక్షాలు
నలుగురు న్యాయమూర్తులు మీడియా మందుకు వచ్చి న్యాయవ్యవస్థలోని లోపాలు బహిరంగంగా వెల్లడించడం అన్నది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సంకేతమని విపక్షాలు వ్యాఖ్యానించాయ. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సీపీఎం డిమాండ్ చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిజాయితీకి ఏ రకంగా విఘాతం వాటిల్లుతుందో నిగ్గుతేల్చడానికి సమగ్ర దర్యాప్తు అవసరమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థలో ఆమోదయోగ్యం కాని పరిణామాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయని న్యాయమూర్తులు చెప్పడం ఇందుకు నిదర్శమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కీలక వ్యవస్థలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థల్లో ఏ సమస్య తలెత్తినా దాన్ని తక్షణ ప్రాతిపదికన సరిదిద్దాలని ఏచూరి చెప్పారు.