జాతీయ వార్తలు

‘కమాల్’ చేస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 22: ప్రసిద్ధ నటుడు కమల్‌హసన్ రాజకీయం అరంగేట్రం దీర్ఘకాలంగా రాష్ట్రంలో కొనసాగుతున్న సినీ రాజకీయ బంధానికి కొనసాగింపే. దశాబ్దాలపాటు తమిళ చిత్రాల్లోనే కాకుండా తెలుగు, మలయాళ సినిమాల్లోనూ రాణించి ప్రేక్షకులను మెప్పించిన కమల్‌హాసన్ మక్కళ్ నీది మయం (ప్రజా న్యాయ వేదిక) అనే పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో ఆయన విజయావకాశాలపైన తమిళ ప్రజలను మెప్పించి తమవైపు తెప్పించుకునే విషయంలో ఎంతమేరకు సఫలీకృతం అవుతారన్నదానిపైనా ఆసక్తికర ఊహాగానాలు సాగుతున్నాయి. సినీరంగంలో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన నటుల్లో ఎక్కువ మంది విజయాన్ని సాధించగలిగారు. ఎజీ రామచంద్రన్, డీఎంకే అధినేత కరుణానిధి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు కూడా. వారి విజయం నేపథ్యంలోనే అనంతర కాలంలో కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చినా వీరు సాధించినంతగా విజయాలను సాధించలేకపోయారు. జన బాహుళ్యాన్ని ఎజీఆర్, కరుణానిధి తరహాలో తమదైన సిద్ధాంతాలతో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ద్వారా ఆకట్టుకోలేకపోయారు. మూడు దశాబ్దాలపాటు తమిళ సినీ రంగాన్ని ఏలిన ఎజీఆర్ 1977 నుంచి తుదిశ్వాస విడిచే వరకు 1987 దాకా పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అలాగే డీఎంకే అధినేత కరుణానిధి ఇటు ముఖ్యమంత్రిగానూ, అటు ప్రతిపక్ష నాయకుడుగానూ పలు సందర్భాల్లో తమిళ రాజకీయాలను ఎన్నో మలుపులు తిప్పారు. తాజాగా పార్టీ పెట్టిన 63ఏళ్ల కమలహాసన్ విషయానికి వస్తే ఆయన సినీ జీవితం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ రాణించి జాతీయ నటుడిగా ఖ్యాతినొందారు. ముఖ్యంగా దక్షిణాదిన తనకున్న అభిమాన గణాన్ని ఈ ఆరు రాష్ట్రాలతోనూ తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకునే రాజకీయంగా బలంగా రాణించగలనన్న ధీమాను కమల్ వ్యక్తం చేస్తున్నాడు. ఆరు దక్షిణాది రాష్ట్రాలతోనూ బలమైన బంధాన్ని పెంపొందించుకుంటానని పార్టీ ప్రారంభ సమయంలో సంకేతాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఆయన రాజకీయ ప్రకటనలు కూడా మొత్తం దక్షిణాది రాష్ట్రాలను ఆకట్టుకునేవిగా ఉన్నాయి. సాధారణంగా ప్రాంతీయ నాయకులు అంతరాష్ట్ర ఉద్రిక్తతలను తమ రాజకీయ ఎదుగుదలకు బలమైన వేదికగా మార్చుకుంటారు. కర్నాటకతో ఉన్న కావేరీ వివాదం సహా ఈ అంతరాష్ట్ర సమస్యలను దౌత్యపరమైన రీతిలోనే లౌక్యంతో పరిష్క్రరించుకుంటామన్న సంకేతాలను ఆయన అందించారు. ఇప్పటికే కావేరీ జలాల విషయం రాజకీయమయంగా మారిందని, ఇకముందు అలాంటి పరిస్థితికి ఆస్కారమే ఉండకూడదన్నారు. అందరూ ఊహించినట్టుగా కమల్ పార్టీ ఆవిర్భవించినా ఎజీఆర్, జయలలిత తరహాలో కమల్‌హాసన్ ఏ మేరకు తన రాజకీయ సత్తాను నిరూపిచుకోగలుగుతారన్నది వేచిచూడాల్సిందే. తమిళనాట సినీరంగంలో ఖ్యాతినార్జించి రాజకీయాల్లోకి వచ్చిన తొలివ్యక్తి డీఎంకే సంస్థాపకుడు సీఎన్ అన్నాదురై. అలాగే 1967లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహించారు. జయలలిత, ఎజీఆర్, కరుణానిధి తరహాలో సినీ రంగానికి చెందిన అందరూ రాజకీయాల్లో విజయ దుందుభి మోగిస్తారన్న హామీ ఏమీ లేదు. ఇందుకు మరో ప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ ఉదంతమే నిదర్శనం. అటు డీఎంకేలోనూ, కాంగ్రెస్‌లోనూ పనిచేసిన శివాజీ గణేశన్ సొంతంగా పార్టీ పెట్టుకుని 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే విజయకాంత్ కూడా డీఎండీకే పేరుతో కొత్త పార్టీని పెట్టినా అనుకున్న స్థాయి విజయాలు ఆయనకు అందకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కమల్ చెరిష్మా ఏ మేరకు ఫలిస్తుంది? ఎజీఆర్, జయలలిత, కరుణానిధి తరహాలో తమిళ జనబాహుళ్యాన్ని రాజకీయంగా కూడా ఆకట్టుకోగలుగుతారా అన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.