జాతీయ వార్తలు

శ్రీదేవి.. ఇక లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 25: తనదైన అద్వితీయ నటనా కౌశలంతో యావద్భారత ప్రేక్షక లోకాన్ని సమ్మోహితం చేసిన ప్రఖ్యాత నటి శ్రీదేవి ఇక లేరు. దుబయిలో జరిగిన తన మేనల్లుడి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఐదేళ్ల వయసులోనే బాలనటిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి నాలుగు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం సహా దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ అనితర సాధ్యమన్న రీతిలో రాణించారు. మానాన్న నిర్దోషి, బడిపంతులు, యశోదా కృష్ణ తదితర చిత్రాల్లో బాల నటిగా మెప్పించన శ్రీదేవి అనంతరం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మురళీ మోహన్, చంద్రమోహన్, కమల్‌హసన్, రజనీకాంత్ వంటి దక్షిణాది నటులందరితోనూ నటించారు. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా సునాయాసంగా, ఉత్తేజిత రీతిలో పండించలిగే సామర్థ్యం శ్రీదేవికి ఉందని చెప్పడానికి ఓ వసంత కోకిల, ఆకలి రాజ్యం వంటి ఎన్నో చిత్రాలు నిదర్శనం. దుబయిలో జరిగిన పెళ్లికి హాజరైన శ్రీదేవి బాత్‌రూమ్‌లో మరణించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. పెళ్లి తర్వాత ఆమె బంధువులందరూ వెనక్కి వచ్చేసినా భర్త బోనీకపూర్, కుమార్తె ఖుషితో శ్రీదేవి అక్కడే ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలోనే శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమెకు గుండె పోటు వచ్చినట్టుగా చెబుతున్నారు. తెలుగులో పదహారేళ్ల వయసుతో కధానాయకిగా తొలి అడుగు వేసిన శ్రీదేవి అనంతరం వేటగాడు. జస్టిస్ చౌదరి, ప్రేమాభిషేకం, త్రిశూలం, కార్తీక దీపం, బంగారక్క వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సోల్వాసావన్ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన శ్రీదేవికి జితేంద్ర హీరోగా నటించి హిమ్మత్‌వాలా మంచి పేరు తెచ్చింది. ఇక అక్కడి నుంచి జాతీయ నటిగా ఎదిగిపోయారు. ప్రద్మశ్రీ, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. తోఫా, మిస్టర్ ఇండియా, చాందినీ సినిమాలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. బోనీకపూర్‌తో వివాహానంతరం కొనే్నళ్ల పాటు సినిమాకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చారు.
బహుభాషా నటి శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల రాష్టప్రతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన శ్రీదేవి తనదైన రీతిలో చెరగని ముద్ర వేశారని మోదీ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్టు సంతాప సందేశంలో తెలిపారు. శ్రీదేవి ఇక లేరన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్టప్రతి కోవింద్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అద్వానీ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు శ్రీదేవి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి పోషించిన పాత్రలే ఆమెను చిరస్మరణీయంగా ఉంచుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. తన అసమాన నటనతో దేశం గర్వించదగ్గ నటిగా శ్రీదేవి ఎదిగారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.