జాతీయ వార్తలు

ఆగ్రహం నుంచి ఆనందం వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 13: ఎంత ఆగ్రహంతో వచ్చిందో అంతకుమించిన ఆనందంతో రైతాంగం వెనుతిరిగింది. అప్పులు, ఆత్మహత్యలు తప్ప రైతు బతుకుకు మరో మార్గం లేదా? అంటూ తీవ్ర ఆగ్రహంతో పాదం బిగించి ముంబయిని చుట్టుముట్టిన వేలాది రైతులు, అనూహ్య విజయంతో ముంబయి నుంచి ఇంటి ముఖంపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచీ కదిలిన రైతు దండును చూసి ముచ్చెమటలు పట్టిన మహా సర్కారు, డిమాండ్లకు తలొగ్గి రైతును శాంతపర్చడం తెలిసిందే. సిపీఐ (ఎం) అనుంబంధ సంస్థ అఖిల భారతీయ కిసాన్ సభ నేతృత్వంలో 35వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబయికి ఆరు రోజులపాటు మహాయాత్ర నిర్వహించడం తెలిసిందే. మండుటెండను లెక్కచేయకుండా, కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా వేదనాభరిత బతుకు పాటతో ముంబయికి దండుకట్టిన రైతు ఎట్టకేలకు విజయం సాధించాడు. కనె్నర్ర చేసి కర్ర పట్టిన రైతును చూసి కంగారుపడిన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ‘డిమాండ్లన్నీ నెరవేరుస్తాం’ అన్న ఏకవాఖ్య హామీతో రైతును శాంతపర్చింది. నూరుశాతం పంట రుణ మాఫీ, అటవీ భూములపై హక్క్భుక్తం కల్పిస్తామన్న హామీని నిర్ణీత గడువులోగా నెరవేరుస్తామని అంగీకరించింది. ముంబయిని చుట్టుముట్టడానికి సోమవారమే ఆజాద్ మైదానానికి చేరుకున్న రైతులు, గిరిజనులు.. సాధించిన తాజా విజయంతో బస్సులు, రైళ్లు, ప్రయివేట్ వాహనాల్లో ఇంటి ముఖం పట్టారని స్థానిక పోలీసులు తెలిపారు. ఉద్యమానికి కదిలొచ్చిన రైతు, గిరిజనులకు ముంబయివాసులు ఆహారం, నీళ్లు అందించి ఆదుకోవడం ఒక ఎత్తయితే, విజయంతో ఇంటికి వెళ్తున్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేయడం మరో ఎత్తని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, అఖిల భారతీయ కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావాలే వ్యాఖ్యానించారు. రైతులంతా ఇళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, రైతులంతా టికెట్లుకొని రైలెక్కారని, రైతు నిజాయితీకి ఇదొక నిదర్శనమని అన్నారు. సోమవారం రాత్రికి సియోన్‌లోని సోమియా మైదానానికి రైతు పాదయాత్ర చేరుకున్నపుడూ, దక్షిణ ముంబయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వంద బస్సులు ఏర్పాటు చేసినా, తాము పాదయాత్రగానే వెళ్లాం తప్ప ఉచిత రవాణా సేవ వాడుకోలేదని ధవాలే గుర్తు చేశారు. ముంబయి ప్రజానీకం, ఎస్సెస్సీ, హెచ్చెస్సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకూడదనే అలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘యుద్ధంలో విజయం సాధించాం. అయినా, యుద్ధం ముగిసినట్టు కాదు. ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో ఏమేరకు అమలవుతాయో చూస్తాం. ఇప్పుడు మహా రైతు ముఖంపై చిర్నవ్వు తాండవిస్తోంది. ఆ చిర్నవ్వు చెరిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని ధవాలే వ్యాఖ్యానించారు.
మాట తప్పితే మహా సంగ్రామమే: ఏచూరి
ప్రభుత్వ హామీలను నమ్మి చిర్నవ్వుతో ఇంటికి వెళ్తున్న రైతుకు మరోసారి ఆగ్రహం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోకపోతే ఉద్యమం రైతుకే పరిమితం కాదని, సకలజన సంగ్రామం తప్పదని హెచ్చరించారు. ‘ఈసారి ప్రభుత్వం రైతుకు రాతపూర్వక హామీలిచ్చింది. ఆరు నెలల్లో నెరవేరుస్తామని ప్రకటించింది. ఇందులో తేడావస్తే మహా సంగ్రామం తప్పదు’ అని హెచ్చరించారు. ‘బీజేపీ ప్రభుత్వమేమో విపక్ష ముక్త భారత్ కోరుకుంటోంది. రైతాంగమేమో కర్జ్ ముక్త భారత్ కోరుతోంది అని వ్యాఖ్యానించారు. 2916లో నాసిక్‌కు లక్షమంది రైతాంగం పోటెత్తినపుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విస్మరించటం వల్లే రైతుల్లో ఆగ్రహం కట్టెలు తెంచుకుంది’ అని ఏచూరి అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులతో మంగళవారం విధాన భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘చాలావరకూ రైతు డిమాండ్లు అంగీకరించాం. రాతపూర్వక హామీ సైతం ఇచ్చాం’ అని ప్రకటించారు.
చిత్రం.. ఆందోళన ముగిసిన అనంతరం నాసిక్‌కు తిరిగి వెళ్లేందుకు సోమవారం రాత్రి .ముంబయి లోని రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వేచివున్న రైతులు