జాతీయ వార్తలు

అంత తేలిక కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ సహా మొత్తం ఏడు ప్రతిపక్షాలు ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుకు శుక్రవారం ఇచ్చిన అభిశంసన నోటీసు అంత సులభంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ సభ్యులైతే వంద మంది, రాజ్యసభ సభ్యులైతే యాభై మంది ఎంపీలు సంతకం చేయవలసి ఉంటుంది. దీపక్ మిశ్రాను తొలగించాలంటూ ప్రతిపక్షం ఇచ్చిన అభిశంసన నోటీసుపై 64 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. ప్రతిపక్షం ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్టప్రతి వెంకయ్యనాయడు పరిశీలనాంతరం తనకు తానే తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు. ఆమోదించే పక్షంలో నోటీసులో చేసిన ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, ఒక ప్రఖ్యాత న్యాయ కోవిదుడితో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ కమిటీ సదరు న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నోటీసు రాజ్యసభకు చెందినదైతే ఉపరాష్టప్రతికి లోక్‌సభదైతే స్పీకర్‌కు తమ నివేదికను అందజేస్తారు. అభిశంసన నోటీసులో చేసిన ఆరోపణల్లో నిజమున్నట్లు ముగ్గురు సభ్యుల కమిటీ అభిప్రాయపడితే దానిని చర్చకు చేపట్టవలసి ఉంటుంది. అభిశంసన తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఉభయ సభలు దానిని మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుంది. రెండింటిలో ఏ ఒక్క సభ రెండింటా మూడువంతుల మెజారిటీతో ఆమోదించని పక్షంలో అభిశంసన తీర్మానం ఓటమిపాలవుతుంది. దీనికి బదులు ఉభయ సభలు అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు దానిని తదుపరి చర్య కోసం రాష్టప్రతికి పంపిస్తారు. రాష్టప్రతి సదరు న్యాయమూర్తిని తొలగిస్తూ ప్రెసిడెన్షియల్ ఆదేశాలను జారీ చేస్తారు. గతంలో ఎప్పుడు కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం చర్చకు రాలేదు. అయితే 1993లో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామిపై వచ్చిన అభిశంసన తీర్మానం మొదటి నాలుగు దశలు పూర్తి చేసుకుని పార్లమెంటులో ఓటింగ్‌కు వచ్చినప్పుడు లోక్‌సభలో రెండింట మూడు వంతుల మంది సభ్యులు సమర్థించకపోవటంతో వీగిపోయింది.
ఇప్పుడు దీపక్ మిశ్రాపై ఏడు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం మొదటి దశ కూడా దాటుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ముఖ్యమైన ప్రతిపక్షాలు సమర్థించకపోవటం గమనార్హం. 2018 అక్టోబర్ రెండో తేదీన అంటే మరో ఐదు నెలల్లో పదవీ విరమణ చెందుతున్న దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ ఎంపీలు, నాయకులు సైతం సుముఖత వ్యక్తం చేయలేదు. ఇదిలాఉండగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఏడు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో పెద్దగా నిజం లేదని అంటున్నారు. వెంకయ్యనాయుడు ఈ కారణాల దృష్ట్యా దీపక్ మిశ్రాపై వచ్చిన అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు. దీనికి బదుల అభిశంసన తీర్మానంపై ముగ్గురు న్యాయ కోవిదులతో కూడిన కమిటీ దీపక్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తిరస్కరించవచ్చు. అభిశంసన తీర్మానం ఈ దశలన్నీ దాటి పార్లమెంటులో చర్చకు వస్తే రాజ్యసభ ఆమోదించినా బీజేపీకి మెజారిటీ ఉన్న లోక్‌సభలో ఇది వీగిపోకతప్పదని అంటున్నారు. దీపక్ మిశ్రాకు బీజేపీ మిత్రుడనే పేరుంది. ప్రతిపక్ష పార్టీలు వివిధ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రతిపాదించిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.