జాతీయ వార్తలు

బుఖారీకి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీరి (జమ్మూ, కాశ్మీర్), జూన్ 15: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీకి అతని స్వగ్రామం క్రీరిలో శుక్రవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని తన కార్యాలయం నుంచి గురువారం రాత్రి బయటకు వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి వెళ్తున్న బుఖారీని, అతని ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సీనియర్ జర్నలిస్టు బుఖారీ హత్యను అన్ని రాజకీయ పార్టీల నేతలు, పలు సంఘాలు ఖండించాయి. ఆయన అంత్యక్రియలు వేలాదిమంది అశ్రునయనాల మధ్య బారాముల్లా జిల్లాలోని ఆయన స్వగ్రామం క్రీరీలో శుక్రవారం జరిగాయి. ఆయన ఎడిటర్‌గా ఉండే రైజింగ్ కాశ్మీర్ పేపర్ మొదటి పేజీలో నలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో బుఖారీ ఫొటో వేసి నివాళి అర్పించింది. ‘పిరికివాళ్లకు మేం భయపడం’ అని పేర్కొంది. ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా, పిడిపి మంత్రులు, బిజేపీ నాయకులు తదితరులు బుఖారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఇలావుండగా బుఖారీ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించడానికి స్థానికులను ప్రశ్నించారు. హత్యజరిగిన అనంతరం బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని సీసీ టీవీలో గుర్తించారు. బహుశా వారే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
మరో నిందితుడి ఫొటో విడుదల చేసిన పోలీసులు
శ్రీనగర్: జర్నలిస్టు బుఖారీ హత్యకేసులో నిందితులను గుర్తించడంలో సహకరించాల్సిందిగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుఖారి హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ఇద్దరి ఫొటోలను పోలీసులు గురువారం రాత్రే విడుదల చేయగా, మరో నిందితుడి చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. అయితే బైక్‌పై వెళ్తున్న ఇద్దరి అనుమానితుల ఫొటోలు అస్పష్టంగా ఉండగా, మూడో వ్యక్తి ముఖం కన్పించ లేదు. ఈ హత్యలో నలుగురు పాల్గొన్నట్టు భావిస్తున్నారు. బుఖారీని హత్య చేసిన వెంటనే ముగ్గురు బైక్‌పై పారిపోగా, అందులో ఇద్దరి చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. సంఘటన జరిగిన స్థలంలో గాయపడ్డ బుఖారీ సెక్యూరిటీ గార్డును కారు నుంచి బయటకు లాగుతున్నట్టు నటించిన ఒక వ్యక్తి తర్వాత పిస్టోల్ తీసి కాల్పులు జరిపాడని, తర్వాత సంఘటనా స్థలం నుంచి కన్పించకుండా పోయాడని వీడియో ఫుటేజిలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులకు సంబంధించిన సమాచారం గాని, ఏదైనా ముఖ్య విషయాలు గాని తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని శ్రీనగర్ పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేశారు.

సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారు చెప్పారు.

చిత్రాలు..దుండగుల కాల్పుల్లో మరణించిన రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్ బుఖారీకి ఆయన స్వగ్రామం క్రీరిలో జరిగిన అంత్యక్రియలకు భారీగా హాజరైన స్థానికులు..* సీసీ టీవీలో అనుమానితులు...