జాతీయ వార్తలు

ట్విట్టర్... ట్విస్టర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. వేలు.. లక్షల మంది తమను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారని గర్వంగా చెప్పుకునే కొందరు సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్‌లోని ఫాలోవర్ల సంఖ్య ట్విట్టర్ చేపట్టిన చర్యలతో గణనీయంగా తగ్గిపోతోంది. ట్విట్టర్‌లో వాడకంలో లేని, లాక్ చేసిన, నకిలీ అకౌంట్లను తొలగించాలని ట్విట్టర్ నిర్ణయించి, ఆ మేరకు ప్రక్షాళనకు దిగి ట్విస్ట్ ఇవ్వడం సెలబ్రిటీలకు షాకింగ్‌గా మారింది. ఒక్క శుక్రవారం రోజే ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్‌లో మూడు లక్షల మంది, రాహుల్‌గాంధీ అకౌంట్‌లో 17వేల మంది తగ్గిపోయారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య లక్ష, మాజీ అధ్యక్షుడు ఒబామాకు నాలుగు లక్షల మంది తొలగారు. మోదీ ఫాలోవర్ల సంఖ్య 43.4 మిలియన్ల నుంచి 43.1 మిలియన్లకు తగ్గిపోయినట్టు, మోదీ వ్యక్తిగత ఖాతాపై కూడా దీని ప్రభావం ఉన్నట్టు సోషల్‌బ్లేడ్.కామ్ వెల్లడించింది. రోజువారీ ప్రాతిపదికన చూస్తే ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరోజులోనే 2,84,746 మంది ఫాలోవర్లను కోల్పోయారు. అలాగే రాహుల్‌గాంధీకి 17,503, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు 1,51,509 మంది తగ్గిపోయారు.
వాడుకలోని లేని, లాక్ చేసిన ట్విట్టర్ అకౌంట్లను తొలగిస్తున్నామని గత వారం ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించి ఆ మేరకు చర్యలు ప్రారంభించింది. చాలామటుకు నకిలీ ఖాతాలు ట్విట్టర్‌లో ఉన్నాయని, వాటి ద్వారా అసత్య వార్తలు, స్పామ్‌ను పంపుతున్నారని ట్విట్టర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దాని యాజమాన్యం ఈ ప్రక్షాళనకు పూనుకొంది. కొందరు అకౌంట్ల నుంచి పెద్ద సంఖ్యలో ట్వీట్లు వెళ్తున్నాయి, తప్పుదోవ పట్టించే లింక్‌లు అనేకం ఉంటున్నాయి. ఇలాంటి అనుమానాస్పదమైన అకౌంట్లను సైతం తొలగించాలని ట్విట్టర్ నిర్ణయించింది. ఇది సెలబ్రిటీల అకౌంట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ‘ఇది కచ్చితంగా కొంతమందికి కష్టం కలిగించవచ్చు. అయితే మేము కచ్చితత్వం, పారదర్శకత్వాన్ని నమ్ముతున్నాం. ఇతరులతో సంభాషించడానికి ట్విట్టర్ ఒక నమ్మకమైన సేవా సాధనం. దీనిని మరింత నమ్మకమైనదిగా చేయనివ్వండి’ అంటూ ట్విట్టర్ పాలసీ, ట్రస్టు సెఫ్టీహెడ్ విజయ్ గాడ్డే పేర్కొన్నారు. ఇలావుండగా, వాడుకలో లేని అకౌంట్లన్నీ స్పామ్ కావని, చాలామటుకు వ్యక్తిగతంగా తెరచినవేనని ట్విట్టర్ తెలియజేసింది.
అమితాబ్, టెండూల్కర్‌లదీ అదే దారి
ట్విట్టర్ చేపట్టిన సంస్కరణల ప్రభావం పలువురు ప్రముఖులపై కూడా పడింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికాపడుకొనే, అమీర్‌ఖాన్, హృతిక్‌రోషన్‌లతో పాటు క్రికెట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, టెండూల్కర్ల ఖాతాలు సైతం ఫాలోవర్లను కోల్పోయాయి. ఫాలోవర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న అమితాబ్ ఖాతా నుంచి నాలుగు లక్షల మంది తొలగారు. ఈనెల 11న 34.89 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆయన ఖాతా ఇప్పుడు 34.47 మిలియన్లకు తగ్గింది. అలాగే దీపికాపడుకొనే 2.8 లక్షలు, అమీర్‌ఖాన్ మూడు లక్షలు, హృతిక్ రోషన్ 2.55 లక్షలు, విరాట్ కోహ్లీ 1.25 లక్షలు, సచిన్‌టెండూల్కర్ రెండు లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ 74,132 మంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 92 వేలు మంది ఫాలోవర్లు తగ్గిపోయారు.
ప్రముఖుల ఖాతాల్లోనే భారీ కుదుపు
నకిలీ, వాడుకలో లేని అకౌంట్ల తొలగింపు కార్యక్రమం ప్రముఖుల ఖాతాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. వాస్తవానికి తమ చర్యతో సామాన్యుడికి మూడు నాలుగు ఖాతాలు తగ్గుతాయని, అయితే సెలబ్రిటీలకు లక్షల మంది ఫాలోవర్లు ఉంటారు కాబట్టి సహజంగానే వారి ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందని, ప్రధాని మోదీ ఖాతాలో కూడా ఇదే కారణం వల్ల ఫాలోవర్లు తగ్గారని పేర్కొంది. ట్విట్టర్‌ను మరింత మెరుగుపర్చడానికే ఈ ప్రక్షాళన చేస్తున్నామని, తమకు సహకరించాలని, ప్రతి ట్విట్టర్ ఖాతాదారుడు తమ ఫాలోవర్లపై నమ్మకం ఉంచాలని ట్విట్టర్ విజ్ఞప్తి చేసింది.