జాతీయ వార్తలు

ఆల్మట్టికి పెరిగిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. వారం రోజులుగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఆల్మట్టి ప్రాజెక్టులోకి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దాంతో ఆల్మట్టికి జలకళ సంతరించుకుంది. గడిచిన 48 గంటల్లో దాదాపు ప్రాజెక్టులోకి 13 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. గత వారం రోజుల క్రితం ఈ ప్రాజెక్టులోకి 50 నుండి 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ మూడు రోజుల నుండి ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది.
ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తూ ఆల్మట్టి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఆదివారం నాటికి ఆల్మట్టి ప్రాజెక్టులో దాదాపు 84.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 129.72 టీఎంసీల నీటి సామర్థ్యం గల అతి పెద్ద ప్రాజెక్టు. ఇంకా ఈ వరద వారం రోజులుగా ఇలాగే వస్తేనే దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కర్నాటకలోని తుంగభద్ర నదిపై గల తుంగభద్ర డ్యాంలోకి సైతం వరద పెరిగింది. ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 100.86 టీఎంసీల కెపాసిటీ గల తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 67 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నదీ ప్రవాహం మరింత ఉద్ధృతి అయి డ్యాం నిండితే తప్ప తెలుగు రాష్ట్రాల్లోని తుంగభద్ర నది పరీవాహక ప్రాజెక్టులకు నీరు వచ్చే పరిస్థితులు కనబడటంలేదు. అటు కృష్ణానది, ఇటు తుంగభద్ర నదుల వరద ఇలాగే ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు పరిస్థితి అగమ్యగోచరంగా మారే పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇకపోతే కర్నాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 37 టీఎంసీలు. అయితే, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 23 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పదిహేను రోజుల క్రితం నారాయణపూర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి దాదాపు అప్పట్లో వారం రోజుల పాటు వరద రావడంతో ఆరు టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి వరద రావడంలేదు. ఆల్మట్టి నిండితే తప్పా నారాయణపూర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చే పరిస్థితులు ప్రస్తుతం కనపడటంలేదు. కర్నాటక ప్రభుత్వం మాత్రం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలోని నీటిని అక్కడి ఎత్తిపొతల ద్వారా తోడేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జూలై మాసం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలోని ఇంకా ఈ ఏడాది కృష్ణానది పరవళ్లు రాకపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. కృష్ణానది బేసిన్ పరిధిలోని జూరాల ప్రాజెక్టు వెలవెల బోతుంది.
గత నెల రోజుల క్రితం కురిసిన వర్షానికి జూరాల ప్రాజెక్టులోకి కొంత వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద కూడా ఈ ప్రాంతంలో కురిసిన వర్షం నీరే. మే మాసం డెడ్ స్టోరేజీలోకి నీటి మట్టం పడిపోయింది. కానీ జూన్ మాసం మొదటి వారంలో ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు, మూడు టీఎంసీల నీరు వచ్చి చేరింది. కానీ వరద నిలిచిపోయి నెల రోజుల గడుస్తున్న నేటీ వరకు జూరాల ప్రాజెక్టులోకి చుక్క నీరు రావడంలేదు. దాంతో జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల రైతులతో పాటు జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నారుమళ్లు పెరిగిపోతుండడంతో ఇంకా కృష్ణానది నుండి జూరాల ప్రాజెక్టుకు వరద రాకపోవడం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా సాగు అవుతుందేమోనని నిరాశ చెందుతున్నారు. జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం ఐదు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పూర్తిగా పడిపోయి ఉంది. 215 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 29 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఖరీఫ్‌లోనే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెబుతున్న తెలంగాణ సర్కార్ ఇంకా శ్రీశైలంకు కృష్ణమ్మ పరవళ్లు రాకపోవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. జూలై మాసం ప్రారంభమై 15 రోజులు దాటినా ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణానది వరద రాకపోవడం విచారకరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తుంగభద్ర నది, కృష్ణానదులు వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతాయి. కానీ రెండు నదులు వెలవెల బోతుండడం శ్రీశైలం ప్రాజెక్టులో కూడా రోజురోజుకు మరింత నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు ఈ ప్రాజెక్టు నుండి వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తూ ఉంటారు.
ఇకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టులో నీటిమట్టం చాలా తగిపోయినట్లు సమాచారం. 312 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టులో ప్రస్తుతం 132 టీఎంసీల నిరు నిల్వ ఉంది. తెలుగు రాష్ట్రాలోని కృష్ణానదిపై గల జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు వెలవెల బోతున్నాయి. కాగా తెలంగాణలోని గోదారమ్మ పొంగి పొర్లుతూ అక్కడి ప్రాజెక్టులను నింపుతోంది. కానీ ఒకే రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థిలు దాపురించాయి. గోదారమ్మ పొంగుతుంటే కృష్ణమ్మ మాత్రం వెలవెల బోతుందనే చెప్పాలి. పత్రికలు, ప్రసార సాధనాల ద్వారా గోదావరి పరవళ్లు ప్రచారం విషయంపై పాలమూరు రైతాంగం తామేమి పాపం చేశామంటూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
చిత్రం..మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద నదిలో నీటి ప్రవాహం లేక వెలవెల బోతున్న కృష్ణమ్మ