జాతీయ వార్తలు

పునరావాసం పెనుసవాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం/కొచ్చి, ఆగస్టు 20: కేరళలో ప్రకృతి ప్రళయ బీభత్సం కొంతమేర తగ్గినప్పటికీ అంతకు మించిన స్థాయిలో పెనుసవాళ్లు అధికార యంత్రాంగాన్ని కమ్ముకుంటున్నాయి. వందేళ్లలో ఎన్నడూ చవిచూడని రీతిలో గత వారం రోజులుగా ప్రకృతి కనె్నర్రకు కకావికలమైంది. లక్షలాది మంది నిర్వాశితులయ్యారు. వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక, పంట నష్టం సంభవించింది. వీటిని అధిగమించి కేరళ మళ్లీ కోలుకోవడం ఒక ఎత్తయితే.. లక్షలాది మందికి పునరావాస కల్పన ఇప్పుడు అధికారులకు ఓ పెనుసవాలుగా మారింది. వర్షాలు, వరద తీవ్రత తగ్గిన ఊరట కంటే కూడా ఈ వారం రోజుల బీభత్సానికి సర్వం కోల్పోయిన వారికి పునరావాస కల్పన అనుకున్నంత తేలికేమీ కాదు. సహాయ చర్యల రూపంలో కోటానుకోట్ల రూపాయలు వచ్చి పడుతున్నా, సహాయ సామాగ్రీ టన్నుల కొద్దీ అందుతున్నా.. వాటన్నింటినీ సక్రమంగా వినియోగించి బాధిత ప్రజలకు అందించడానికి ఓ బృహత్తర ప్రణాళికే అవసరం. సర్వం కోల్పోయి నిర్వాశితులైన ఏడున్నర లక్షల మందికి పునరావాస కల్పన అధికార యంత్రాంగానికి ఓ బృహత్ బాధ్యత. అలాగే ప్రకృతి ప్రళయం ఎప్పుడు సంభవించినా.. అనంతరం మరింత భయానక పరిస్థితుల్ని కలిగించేది అంటువ్యాధుల వ్యాప్తి. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటును ప్రదర్శించినా అది ప్రజల ప్రాణాలకే ముప్పు కలిగించే విపరిణామాలకు దారితీస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు వేలకు పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి పునరావాస కల్పనపై దృష్టి పెట్టామని సైనిక దళాల దక్షిణ కమాండ్ అధినేత డిఆర్ సోని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని చేరుకునేందుకు, వారికి సాయపడేందుకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామని, ఇళ్లపైకప్పుల్లోనూ, సుదూర ప్రాంతాల్లోనూ చిక్కుకు పోయిన వారిని ఆదుకునేందుకు 1500మంది సహాయ సిబ్బంది అహరహం పనిచేస్తున్నారని చెప్పారు. వరద, వర్షతీవ్రతకు దెబ్బతిన్న వేలాది ఇళ్లను తక్షణ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు, వాటిని మళ్లీ నివాస యోగ్యంగా పరిగణించేందుకూ చర్యలు చేపట్టామన్నారు. నీటి ద్వారా వ్యాపించే అంటు వ్యాధులను నివారించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీ పరిమాణంలో బ్లీచింగ్ పౌండర్‌ను నీట మునిగిన అన్ని ప్రాంతాల్లోనూ వెదజల్లుతున్నారు. దేశ వ్యాప్తంగా కేరళకు తరలివచ్చిన సహాయ బృందాలు ప్రజలను ఆదుకునే విషయంలో క్షణం వృధాకాకుండా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత విపత్తు నష్టాన్ని ఎదుర్కోవడంతో పాటు సమీప భవిష్యత్‌లో సంభవించే అవకాశం ఉన్న ఈ రకమైన ఉపద్రవాలనూ తక్షణ ప్రాతిపదికన ఎదుర్కొనేందుకూ సహాయ బృందాలు దూర దృష్టితో వ్యవహరిస్తున్నాయని, సహాయ, సంక్షేమం సహా అన్నింటినీ ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంచడం ద్వారా విపత్తుల తీవ్రతను తగ్గించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని లెఫ్టినెంట్ జనరల్ డిఆర్ సోని తెలిపారు. ప్రకృతి విలయాన్ని అసాధారణమైన శక్తియుక్తులతో, మనోధైర్యంతో ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. తాము చేపడుతున్న సహాయ చర్యల విస్తృతిని శంకించాల్సిన అవసరం లేదని, బాధిత ప్రజలను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కాగా, పునరావాస చర్యల వేగాన్ని పెంచడంతో పాటు విద్యుత్, మంచినీటి సరఫరాపైనా ప్రభుత్వ విభాగాలు దృష్టి పెట్టాయి.
చిత్రం..కేరళలోని చెంగనూర్ ప్రాంతమిది. సహాయక చర్యలు చేపడుతున్న నేవీ హెలికాప్టర్ నుంచి తీసిన ఈ చిత్రం
భారీ వర్షాలు, వరదలకు తల్లడిల్లుతున్న కేరళ దుస్థితికి అద్దం పడుతోంది.