జాతీయ వార్తలు

ట్రిపుల్‌కు ఆర్డినెన్స్ లాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ జారీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ట్రిపుల్ తలాక్‌కు గురైన మహిళ లేదా ఆమెకు సంబంధించిన రక్త సంబంధీకులు, పెళ్లిద్వారా బంధుత్వం ఉన్నవారు పోలీస్ స్టేష్టన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు కేసు పెట్టి చర్య తీసుకుంటారు. ఇతరులెవ్వరైనా వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వీలుండదు. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భార్య అంగీకరిస్తేనే రాజీకి అవకాశం ఉంటుంది. అయితే రాజీ కూడా మేజిస్ట్రేట్ సమక్షంలో సముచిత షరతులతో చేసేందుకు మాత్రమే వీలుంటుందని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేందుకు ఆర్డినెన్స్‌లో వీలు కల్పించారు. అయితే భార్యతో చర్చించిన తరువాతనే దీనికి వీలుంటుందన్నారు. ట్రిపుల్ తలాక్ అనేది భార్యాభర్తల మధ్య జరిగే వ్యవహారం కాబట్టి భార్యతో మాట్లాడిన తరువాతనే మేజిస్ట్రేట్ నిందితుడికి బెయిల్ ఇవ్వగలుగుతాడని ఆయన తెలిపారు. ట్రిపుల్ తలాక్ కేసుల్లో మైనర్ పిల్లల సంరక్షణ తల్లికి మాత్రమే లభిస్తుందని రవి శంకర్ ప్రసాద్
స్పష్టం చేశారు. భార్యాపిల్లల పోషణకు సంబంధించిన ఖర్చును మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు భర్త భరించవలసి ఉంటుంది.
ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చట్టం చేయాలని కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించటం తెలిసిందే. ఆ మేరకు మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించింది. అయితే బిల్లును లోక్‌సభ ఆమోదించినా ప్రతిపక్షం ఆడ్డుకోవటంతో రాజ్యసభలో ఆమోదం లభించలేదు. దీనితో ట్రిపుల్ తలాక్ బిల్లు మురిగిపోయింది. మోదీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆర్డినెన్స్ జారీ చేయటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు సంబందించిన బిల్లును మోదీ ప్రభుత్వం నవంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించనున్నది. మోదీ ప్రభుత్వం ఇంతక్రితం పార్లమెంటులో ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుతో పోలిస్తే బుధవారం మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్‌లో పలు మార్పులు, చేర్పులు చేసింది. ఇంతవరకు ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన 430 సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి, ఇందులో 229 ట్రిపుల్ తలాక్ సంఘటనలు సుప్రీం కోర్టు తీర్పుకు ముందువి. మిగతావి సుప్రీం కోర్టు తీర్పు జరిగిన తరువాత సంఘటనలని రవి శంకర్ ప్రసాద్ వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా ట్రిపుల్ తలాక్ సంఘటనలు కొనసాగాయి. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించేందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన తరువాత కూడా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన సంఘటనలు పెద్దఎత్తున జరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదనేది అర్థం చేసుకోవాలని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రొట్టెలు సరిగా కాల్చనందుకు ట్రిపుల్ తలాక్ ఇచ్చారు.. ఉదయం త్వరగా లేవనందుకు ఒక ముస్లిం మహిళలకు భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు.. ఒక భర్త విదేశం నుండి వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ ఇచ్చిన సంఘటనలు కూడా తమ దృష్టికి వచ్చాయని ఆయన వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించేందుకు తాము కాంగ్రెస్ సహాయం అర్థించాం.. నేను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మను కలిసి చర్చించాం.. మద్దతు ఇవ్వాలని ఐదుసార్లు అడిగాం.. కానీ వారుమాత్రం ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ మహిళల సంక్షేమంకోసం గట్టిగా మాట్లాడుతారు కానీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మాత్రం మద్దతు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్ సంఘటనలు పెరుగుతూ ఉండటంతో ఇప్పుడు ఆర్డినెన్స్‌ను జారీ చేయకతప్పలేదని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ సంఘటనలు ఉత్తరప్రదేశ్‌లో అధికంగా జరిగాయని, సుప్రీం కోర్టు తీర్పుకు ముందు 126 కేసులు జరిగితే.. తీర్పు తరువాత 120 ట్రిపుల్ తలాక్ సంఘటనలు జరిగాయని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రపంచంలోని 22 ముస్లిం దేశాల్లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారని, భారతదేశం వంటి లౌకిక దేశంలో ట్రిపుల్ తలాక్ కొనసాగటం సిగ్గుచేటని ఆయన అన్నారు. పెద్దసంఖ్యలో ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ వలన అన్యాయం జరుగుతుంటే ఎలా సహిస్తామని ఆయన ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ మతం, సంప్రదాయానికి సంబంధించింది కాదు.. ఇది కేవలం మహిళలకు న్యాయం చేయటం, సమానత్వం కల్పించేందుకు సంబంధించిన అంశమని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో మూడుసార్లు తలాక్ చెప్పి ముస్లిం మహిళలను బజారులోకి తోసి వేయటం న్యాయమా? అని ఆయన నిలదీశారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చాం.. అందుకే దీనికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతికి రవి శంకర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఓటు బ్యాంకు రాజకీయంకోసం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించవద్దని ఆయన కోరారు.