జాతీయ వార్తలు

నైతిక రుజువర్తన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారత పారిశ్రామిక రంగం నైతిక కార్పొరేట్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కొన్ని సంఘటనలు మొత్తం పారిశ్రామిక రంగం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ ఆయన అసోచాం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నైతిక సుపరిపాలనను పెంపొందించాల్సిన బాధ్యత చాంబర్లపై ఉందని అన్నారు. ‘ఈ అంశంపై నేను ఈ రోజు నొక్కి చెప్పదలచుకున్నాను’ అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ ద్వారాలను తెరచి ఉంచడం, వ్యాపార సరళతను పెంపొందించడంతో పాటు ప్రజలు పారిశ్రామిక రంగం నుంచి నైతిక ప్రవర్తనను ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక రంగం కూడా బాధ్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా కొందరు విశ్వాసఘాతకులు ఇక్కడ, అక్కడ తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఇక్కడ లూటీలకు పాల్పడి దేశం విడిచి పారిపోతుండటం, చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతుండటం వంటి పనులకు పాల్పడుతున్నారు. ఇది తీవ్రమయిన తప్పుడు సంకేతాలను పంపిస్తోంది. ఇలాంటి సంఘటనలు కొనే్న కావచ్చు. కాని, కొన్ని సంఘటనలే అయినా, దేశానికి గొప్ప సేవలు అందించిన మొత్తం పారిశ్రామిక రంగం ప్రతిష్ఠనే దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. అందువల్ల నైతిక సుపరిపాలన ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. నైతిక ప్రవర్తనను పాటించడం ఎంతో సులభమని ఆయన అన్నారు. పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడం, కార్పొరేట్ సామాజిక బాధ్యతను కలిగి ఉండటం, సభ్యులంతా నియమ నిబంధనలు పాటించేట్లు తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలని ఆయన సూచించారు. ‘దేశంలో వివిధ రకాల సంస్కరణలు ప్రవేశపెడుతుండటం వల్ల వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగం నైతిక సుపరిపాలనను, ప్రవర్తనను పాటించడం ఎంతయినా అవసరం. అవినీతి, లంచాలు, మోసాలకు ఏమాత్రం తావివ్వకూడదంటే వ్యక్తిగతంగా, సంస్థాపరంగా నైతిక ప్రవర్తనను అనుసరించాల్సిన అవసరం ఉంది’ అని ఉప రాష్టప్రతి అన్నారు. ఏమయినా తప్పులు జరిగితే ఎలాంటి భయం లేకుండా ఎవరయినా చెప్పగలిగే వాతావరణాన్ని సంస్థలు సృష్టించాలని ఆయన సూచించారు. ‘పూర్తి స్థాయిలో పన్ను నిబంధనలను పాటించడం అనేది ప్రతి కార్పొరేట్ సంస్థ ధ్యేయం అయి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అసోచామ్ వంటి సంస్థలు తమ సభ్యులను జాగృతం చేయాలి. అప్పుడే మనం స్వచ్ఛమయిన సొమ్మును కలిగి ఉంటాం. ప్రశాంతంగా నిద్ర పోగలుగుతాం’ అని వెంకయ్య నాయుడు అన్నారు.
చిత్రం..అసోచాం 98వ వార్షిక సమావేశంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు