జాతీయ వార్తలు

త్యాగధనులపై ఉదాసీనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసుల గౌరవార్థం ఓ జాతీయ స్మారక చిహ్నాన్ని నిర్మించాలన్న విషయాన్ని గత ప్రభుత్వాలు ఎందుకు విస్మరించాయో చెప్పాలని ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించారు. ఈ అమరవీరుల పట్ల స్వాతంత్య్ర వచ్చిన నాటినుంచి ప్రభుత్వాలు విభిన్న వైఖరితో వ్యవహరించడం శోచనీయమన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పునర్నించిన పోలీసు స్మారక చిహ్నాన్ని, మ్యూజియంను ఆదివారం నాడిక్కడ మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పైళ్లు దుమ్ముకొట్టుకుపోయేలా గత ప్రభుత్వాలు వ్యవహరించాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ జాతీయ పోలీసు చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్నందుకు తానకు గర్వంగావుందంటూనే ఆయన ప్రతిపక్షాలపై ప్రశ్నలను సంధించారు. డెభ్బై యేళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకు ఈ తరహా చిహ్నం నిర్మాణం కాకపోవడానికి గల కారణాలేమిటో గత ప్రభుత్వాధినేతలే చెప్పాలన్నారు. 1959లో లడక్ ప్రాంతంలో చైనా సైనిక దళాల చేతిలో హతులైన 10 మంది పోలీసు అమరవీరుల సంస్మరణార్థం ప్రతియేటా ఇదే రోజున పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆయన గుర్తుచేశారు. 2002లో కేంద్రంలో అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో తొలిసారిగా పోలీసు అమరులకు జాతీయ చిహ్నాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చిందని, అప్పటి హోం మంత్రి లాల్‌కృష్ట అధ్వానీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని మోదీ తెలిపారు. ఆ తర్వాత కొన్ని న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో వ్యవహరించివుంటే ఇదివరకెప్పుడో ఈ జాతీయ చిహ్నం ఏర్పాటైవుండేదన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల బూజుదులిపి కార్యరూపం దాల్చేలా చేశామన్నారు. దేవుడే ఈ కార్యాన్ని తనకు అప్పగించినట్లుగా భావిస్తున్నానన్నారు. లక్ష్యాలను అనుకున్న సమయానికి పూర్తిచేయడంపైనే తన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని మోదీ అన్నారు. ఢిల్లీ అలీపూర్ రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ స్మతి చిహ్నాన్ని నిర్మించే విషయంలోనూ, జాపథ్‌లో అంబేత్కర్ అంతర్జాతీయ కేంద్రం నిర్మాణంలోనూ గత ప్రభుత్వాలు ఇలాంటి దోరణినే ప్రదర్శించాయని గుర్తు చేశారు. ఈ యేడాది ఈ రెండు చిహ్నాలను మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల పట్ల ఈ నిర్లక్ష్య వైఖరి ఏమిటని ప్రశ్నిస్తూ ఐక్యత, సమగ్రతలకు మారుపేరైన మన దేశ సంస్కృతి ఇదికాదని మోదీ ఉద్వేగభరితంగా అన్నారు. ఈ చిహ్నాలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం కావడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. విధినిర్వహణలో పోలీసులు, ప్యారామిలటరీ దళాల ప్రాణత్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోలేదని ప్రధాని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవతప్పిదాల కారణంగా వచ్చే ఆపద్కాలాల్లో వీరు ప్రదర్శించే సాహసాలు నిరుపమానమని వీరిని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ పేరిట కొత్త పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. విధినిర్వహణలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని పోలీసులకు మోదీ సూచించారు. సామాన్యులు పోలీస్‌స్టేషన్లకు వెళ్లి సాధారణ ఫిర్యాదులు చేయలేకపోతున్నారని, అలాగే డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌కు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అణగారిన, పేద వర్గాలకు, అత్యాచారాల బాధితులకు రక్షకులుగా మేమున్నామన్న భరోసా ఇవ్వాలని సూచించారు. వచ్చిన వ్యక్తికి ఒక్క గ్లాసు నీళ్లిచ్చి మంచిగా మాట్లాడటం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపవచ్చని మోదీ అన్నారు. కాగా విధినిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబీకులను ఈ సభలో ప్రధాని మోదీ సత్కరించారు.
చిత్రం..పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని
చాణక్యపురిలో పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని మోదీ