జాతీయ వార్తలు

గిరిజన ఓటు..ఎవరికి చోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడలు బళ్లవుతాయా? బళ్లు ఓడలవుతాయా? అన్న రాజకీయ ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 2014 లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఒకొక్కటిగా తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలను కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల ఆశలు నెరవేరాలంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రాబల్యాన్ని కనబరిచి తీరాల్సిందే..అలాగే అప్రతిహత రీతిలో అధికార రథంలో దూసుకుపోతున్న బీజేపీకీ ఈ ఎన్నికల్లో విజయం అత్యంత కీలకం. కేంద్రంలో మోదీ ప్రాబల్యం మరింత బలపడాలంటే..వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తన పట్టును మరింతగా చాటుకోవాలంటే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం మరింతగా వికసించక తప్పదు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ మూడు చోట్లా ఇటు అగ్రవర్ణాలు, అటు గిరిజన ఓటర్లను ఆకట్టుకుంటూ ముందుకు సాగితేనే బీజేపీ విజయావకాశాలు ఇనుమడిస్తాయన్నది వాస్తవం. ఈ ఓట్ల విషయంలో బీజేపీ అధినాయకత్వం ఎంతగా సమతూకాన్ని పాటించగలుగుతుంది..ఎంతగా సంబంధిత ఓటర్ల మనోభావాలను ఈడేర్చగలుగుతుందన్నదానిపైనే అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుంది. తాజా సంకేతాలను బట్టి చూస్తే ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా బలంగానే పవనాలు వీస్తున్నాయి. వీటి తీవ్రతను తగ్గించుకోవడంలో బీజేపీ నాయకత్వం ఎంత మేరకు కృతకృత్యమవుతుందన్నదీ ఆసక్తిని కలిగించే విషయమే..ముఖ్యంగా ఇటీవల కాలంలో పలు స్థానిక ఎన్నికల్లో బలంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ తన పూర్వవైభవాన్ని చాటుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది? ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత మేరకు విజయం సాధించగలుగుతారన్నదీ ఉత్కంఠ కలిగించే అంశమే..ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని బీజేపీ నిలబెట్టుకోవాలన్నా..కేంద్ర
పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవాలన్నా కూడా ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు కీలకం కానున్నాయి. అందుకే ఈ రెండు జాతీయ పార్టీల అధినేతలు రాష్ట్ర స్థాయి నాయకులు అప్రతిహతంగానే జనంలోకి దూసుకెళుతున్నారు. అయితే ఈ మూడు రాష్ట్రాల్లోనూ గిరిజనులు, ఆదివాసీల ఓట్లను ఎవరైతే గణనీయంగా కైవసం చేసుకోగలుగుతారో..వారిదే పట్టమన్నది వాస్తవం. ముఖ్యంగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వీరి సంఖ్య బలీయంగానే ఉంది. వీటితో పోలిస్తే రాజస్తాన్‌లో గిరిజన జనాభా తక్కువే అయినప్పటికీ పలు జిల్లాల్లో బలంగా ఉండటం వల్ల అక్కడి ఫలితాలను వీరి ఓట్లు తారుమారు చేసే అవకాశం కూడా ఎక్కువే. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే గిరిజన ఓట్లు భారీగా పడ్డాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. అంతకు ముందు వరకూ కూడా గిరిజన ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. మొదటి నుంచీ
కూడా గిరిజన ఓటర్ల మద్దతు విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టిపోటీ జరుగుతూనే వస్తోంది. రిజర్వ్‌డ్ సీట్లను కైవసం చేసుకోవడంలో ప్రాంతీయపరమైన ప్రతికూలతలు ఈ రెండు పార్టీలకూ ఎదురైనప్పటికీ కాంగ్రెస్‌తో పోలిస్తే ఈ విషయంలో బీజేపీదై పైచేయిగా కనిపిస్తోంది. 2017 వరకూ ఆదివాసీల మద్దతును గణనీయంగా చూరగొన్న బీజేపీకి గత కొంత కాలంగా ఈ వర్గాల నుంచి వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పైగా తమపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల 54శాతానికి పైగా ఆదివాసీ ఓటర్లు అసంతృప్తితోనే ఉన్నట్టూ స్పష్టం అవుతోంది. ఈ చట్టం విషయంలో కొనసాగుతున్న వివాదం ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అగ్ర వర్ణాలు, ఎస్‌సి ఎస్‌టి ఓటర్ల మధ్య ఇప్పటికే ఈ చట్టం సవరణల కారణంగా తీవ్ర స్థాయిలోనే అగాథం ఏర్పడింది. ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అగ్ర వర్ణాలు వీధికెక్కడం ఇందుకు నిదర్శనం. చత్తీస్‌గఢ్‌లో దీని ప్రభావం చాలా తీవ్రంగానే ఉండే అవకావం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఎక్కువగా ఆదివాసీ ఓట్లు పడ్డాయి. తాజా ఎన్నికల్లో అజిత్ జోగి సారథ్యంలోని చత్తీస్‌గఢ్ జనతా ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నదానిపైనే బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతం ఆధారపడి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కంటే కూడా ఆదివాసీల మద్దతు బీజేపీకే ఎక్కువ. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ వాస్తవం మరింత స్పష్టమైంది. రాజస్థాన్ విషయానికొస్తే గిరిజన ఓట్లపై రెండు పార్టీలు బలమైన పట్టునే కనబరుస్తూ వస్తున్నాయి. ఈ అనుకూల, ప్రతికూలతలను అధిగమిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్లే పార్టీదే ఈ మూడు రాష్ట్రాల్లో పట్టమనడంలో ఎలాంటి సందేహం లేదు.
- బి.రాజేశ్వర ప్రసాద్