జాతీయ వార్తలు

ఆర్థిక మోసగాళ్లకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రధాని మోదీ ప్రభుత్వం మోసగాళ్లను ప్రోత్సహిస్తోందని, వారు దేశం వదలిపోవడానికి సహాయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పరారైన మెహల్ ఛోక్సీ తరఫున న్యాయవాదులుగా వ్యవహరించడానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అల్లుడు, కుమార్తె 24 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అరుణ్‌జైట్లీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఏడాది జనవరి వరకు ముగిసిన 44 నెలల మోదీ ప్రభుత్వ హయాంలో అనూహ్యంగా 90 వేల కోట్ల రూపాయల విలువైన 19 వేల బ్యాంకు మోసం కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వ హయాంలో 23 మంది మోసగాళ్లు భారత్ నుంచి విదేశాలకు పరారయ్యారని, 53 వేల కోట్ల వరకు మోసం జరిగిందని అన్నారు. ఇదేనా న్యూ ఇండియా అంటే అని ఆయన ప్రశ్నిస్తూ, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశం నుంచి విజయ్‌మాల్యా, లలిత్ మోదీ, నిరవ్‌మోదీ, మెహల్ ఛోక్సీ లాంటి వారు వేల కోట్లరూపాయల మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోవడం చూస్తుంటే మోదీ ప్రభుత్వం ప్రజల ధనానికి పరిరక్షకుడిగా కాకుండా, మోసగాళ్లను విదేశాలకు పంపే ట్రావెల్ ఏజెన్సీగా పనిచేస్తున్నట్టు కన్పిస్తోందని అన్నారు. అరుణ్ జైట్లీ ఫైనాన్స్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా ఉండగా ఆయన కుమార్తె సొనాలి జైట్లీ, అల్లుడు జయేష్ భక్షి మెహల్ ఛోక్సీ కంపెనీకి న్యాయసలహాదారులుగా ఉండటానికి 24 లక్షల రూపాయలు తీసుకున్నారని సచిన్‌పైలట్ ఆరోపించారు. అయితే ఛోక్సీ మోసం బయటపడిన తర్వాత తాము ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసామని జైట్లీ అల్లుడు ప్రకటించినా, ఒకమోసపూరిత కంపెనీతో వారు కుమ్మక్కయ్యారనడానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. ఇందులో జైట్లీకి సైతం పాత్ర ఉందని, ఇంత జరిగినా జైట్లీ కుమార్తె, అల్లుడుని సీబీఐ కాని, ఈడీ కాని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు కేసు నమోదు చేయలేదని అన్నారు. అనేక ఫిర్యాదులు వచ్చినా, ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా మెహల్ ఛోక్సీ, నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, ఇతరులపై ఎందకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్‌కు ఎలాంటి పనిచేయకుండానే జైట్లీ కుమార్తె, అల్లుడు 24 లక్షలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు. వారి సంస్థకు ఉన్న క్లయింట్లు ఎవరు? వారి పేర్లు ఎందుకు బయట పెట్టరు, ఛోక్సీ కుంభకోణం బయటపడ్డ తర్వాత వారు తిరిగి 24 లక్షల రూపాయలను తిరిగి డిపాజిట్ ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండటం కన్నా, ఇలాంటి వారికే పూర్తి విధేయతతో పనిచేస్తోందని సచిన్‌పైలట్ ఆరోపించారు. వేలకోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ఇలాంటి వారు విదేశాలకు పారిపోవడానికి మోదీ ప్రభుత్వం కేవలం సహాయపడటమే కాకుండా వారికి రక్షణ, న్యాయ సహాయాన్ని సైతం అందిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో సచిన్‌పైలట్‌తో పాటు కాంగ్రెస్ నేతలు రాజీవ్ సతవ్, సుస్మితాదేవ్ పాల్గొన్నారు.