జాతీయ వార్తలు

ఏ పార్టీకీ మెజారిటీ రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందే జాతీయస్థాయిలో బీజేపీయేతర పక్షాలతో కూటమిని ఏర్పాటు చేయడం బహుశా సాధ్యం కాకపోవచ్చునని, అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆ పార్టీలన్నింటినీ ఒక వేదికమీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాన ని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ అన్నారు. ఆజ్‌తక్ న్యూస్‌ఛానల్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ కనుక ఓటమి చెందితే, అధికారం చేపట్టే స్థాయిలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలను తాను చూడటం లేదని అన్నారు. అయితే వివిధ పార్టీల వారందరినీ ఒకేచోటకు తీసుకువచ్చే ప్రయత్నంలో తాను ఆయా పార్టీల నేతలతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితి 2004 సంవత్సరంలోలా ఉందని అన్నారు. అప్పట్లో లాగే ఏ పార్టీకి కూడా అధికారం చేపట్టే స్థాయిలో మెజారిటీ రాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని తాను భావించడం లేదని అన్నారు. కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినా 2004లో అధికారం చేపట్టి పదేళ్ల పాటు నిరాటంకంగా పాలించిందని, మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారని ఎవరూ కనీసం ఊహించలేదని, కాని ఆయన పదేళ్ల పాటు ప్రధానిగా ఉండి స్థిరమైన పాలనను అందించారని పవార్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ కన్నా గతంలో ప్రధానిగా చేసిన అటల్ బిహారీ వాజపేయి ప్రతిభా, పాటవాలు అధికమని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎన్నడూ శూన్యత ఏర్పడదని, ప్రత్యామ్నాయ నేతలు ఉంటారని అన్నారు. ఒకవేళ బీజేపీకి కనుక మెజారిటీ వస్తే మహారాష్టక్రే చెందిన నితిన్ గడ్కరీ ప్రధాని కావడానికి ఎన్‌సీపీ మద్దతు ఇస్తుందా? అన్న ప్రశ్నకు బీజేపీకి చెందిన ఎవరికీ తాను సహకరించనని పవార్ స్పష్టం చేశారు.
హెచ్‌కె దేవెగౌడ, ఐకె గుజ్రాల్ లాంటి వారు నాటి పరిస్థితుల్లో ఆకస్మికంగా ప్రధానులయ్యారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం లేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ ‘చిదంబరం ఏమి చెప్పారో అదే కాంగ్రెస్ వైఖరి’ అని పేర్కొన్నారు. తాను అనేకసార్లు రాహుల్‌ను కలిసినప్పుడు తాను ప్రధాని కావాలని ఆయన అనుకుంటున్నట్టు ఎన్నడూ అన్పించలేదని అన్నారు. 2019 ఎన్నికలు మోదీ వర్సెస్ గాంధీకి అని చూపడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆయన మాట్లాడుతూ ఇది కేవలం బీజేపీ వ్యూహమని, కాని ఇది ఫలించదని చెప్పారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటులో ఏర్పడిన వైఫల్యాల గురించి ఆయన మాట్లాడుతూ స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు వ్యవహరిస్తుంటాయన్నారు. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు, వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ లాంటి వారి ప్రాబల్యం ఉంటుందని ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి వారు కూటమిలో చేరాలా, వద్ద అనే విషయాన్ని నిర్ణయించుకుంటారని అన్నారు. ఏదిఏమైనా ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆయా పార్టీలు గెలిచిన స్థానాలను బట్టి కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి, ఎవరు ప్రధానిగా ఉండాలి లాంటి విషయాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ ఎన్‌సీపీని విలీనం చేస్తారని వస్తున్న వార్తలను ఆయన కొట్టివేశారు. ప్రజల అభీష్టం మేరకు మోదీ పాలన కొనసాగలేదని, 2014లో ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ప్రస్తుత వాస్తవ పరిస్థితిని చూస్తే ఆయన పాలన సంతృప్తికరంగా లేదని శరద్‌పవార్ చెప్పారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే కనుక సరిగ్గా ఉంటే ఇప్పుడు సీబీఐ లాంటి సంస్థలో అవినీతికి ఆస్కారం ఏర్పడి ఉండేదే కాదని ఆయన అన్నారు. మోదీ పార్టీలోనే బలమైన నాయకుడు తప్ప దేశ ప్రజలకు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ ఒప్పందంలో కుంభకోణం దాగి ఉందని, దీనిపై జేపీసి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోఫోర్సు కుంభకోణం సమయంలో జేపీసీ డిమాండ్‌పై మూడువారాల పాటు పార్లమెంట్‌ను స్తంభింపజేసిన బీజేపీ ఇప్పుడు రాఫెల్‌పై ఎందుకు వెనుకడుగు వేస్తోందని శరద్‌పవార్ ప్రశ్నించారు.