జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో బుసలు కొడుతున్న అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి బుసలు కొడుతోంది. వచ్చే నెల 7వ తేదీన రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసమ్మతిని చల్లార్చేందుకు బుజ్జగింపులు చేపట్టారు. కాని అసమ్మతి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.అసమ్మతి దెబ్బకు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో 50 చోట్ల కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ రంగంలోకి దిగారు. ఈ సారి ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సర్వేలు కూడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి. అంత మాత్రాన కాంగ్రెస్ గెలిచినట్లు కాదు. ఎందుకంటే రెబల్ అభ్యర్థులు రంగంలో ఉంటే ఓట్లు చీలుతాయి. దీని వల్ల స్వల్ప ఆధిక్యతతో ప్రత్యర్థిపార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా అనూహ్యంగా చివరి నిమిషంలో పుంజుకుంటోంది. బీజేపీ ఎన్నికల మ్యాజిక్ చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇంకా బీజేపీ అగ్రనేతలు సుడి గాలిపర్యటనలు చేపట్టారు.
అసమ్మతి నేతలను బుజ్జగించి వారి చేత నామినేషన్లను ఉపసంహరింపచేసేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాసిక్, రాజీవ్ శుక్లాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇంకా సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసి అసమ్మతినేతలతో మాట్లాడిస్తున్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్, సచిన్‌పైలెట్ కూడా అసమ్మతి నేతలు, తిరుగుబాటు అభ్యర్థులతో ఫోన్లలో ఎడతెరిపిలేకుండా మాట్లాడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే, మరో నలుగురు కార్యదర్శులు కూడా కాలికి బలపం కట్టుకుని అసమ్మతి నేతల ఇండ్లకు వెళుతున్నారు. మహదేవ్ సింగ్ ఖండేలా, బాబూలాల్ నగర్, లలిత్ భాటీ, బ్రహ్మదేవ్ కుమావత్ తదితర కాంగ్రెస్ రాష్ట్ర దిగ్గజాలకు టిక్కెట్లు రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా రెబల్స్‌గా రంగంలో దిగారు. వీరికి టికెట్లు నిరాకరించడంతో ఎన్నికల బరిలోకి దిగారు. సీఎస్‌బైడ్, సన్యాం లోధా, నాత్‌రామ్ శినోడి, సీఎల్ ప్రేమి, భీమ్‌రాజ్ భాటీ, హాజీ అబ్దుల్ ఖయూమ్‌లు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 110 మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. 85 మంది పాత వారికి టికెట్లను ఇచ్చింది. నవంబర్ 22వ తేదీన అంటే గురువారం నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
బీజేపీలో కూడా అసమ్మతి సెగలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. బీజేపీ అంటే క్రమశిక్షణ పార్టీ అనేరోజులకు కాలం చెల్లింది. దాదాపు 20 చోట్ల రెబల్స్ రంగంలోకి దిగారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఏదో విధంగా గారడీ చేసి గెలుస్తామనుకుంటే, రెబల్స్ గెలుపుకు గండి కొడతారని బీజేపీ ఆందోళన చెందుతోంది. టిక్కెట్లు రాలేదని ఐదుగురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. సురేంద్ర గోయల్, రాజ్ కుమార్ రిన్వా, ధన్ సింగ్ రావత్, హేమ్ సింగ్ బండానా తదితర మంత్రులకు టిక్కెట్లు రాలేదు. దీంతో వీరందరూ ఆగ్రహించి నామినేషన్లు దాఖలు చేశార. గోవల్ , రిన్వా, రావత్ భండానా తదితర బీజేపీ నేతలు కూడా టిక్కెట్లు ఇవ్వలేదనే కోపంతో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. మహువా, లాడపురా, రామ్‌గడ్, సంగ్వారా, సోజత్, మాల్‌పురా, శ్రీదురంగగడ్, దుంగార్పూర్, గటోల్, నినమా, సిక్రాయ్ తదితర సిటింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వసుంధర రాజె రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో మాట్లాడుతున్నారు. వీరిలో ఎంత మంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారో గురువారం సాయంత్రానికి తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ, రాష్ట్ర ఇన్ చార్జీ అవినాష్ రాజ్ ఖన్నా బృందాలుగా ఏర్పడి బీజేపీ రెబల్ అభ్యర్థులు ఇండ్లకు వెళ్లి బతిమలాడుతున్నారు. బీజేపీ 82 మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. 60 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు టిక్కెట్లు ఇవ్వలేదు.
బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరిని అడిగినా రెబల్స్ శాంతించారని, సమస్యలేదని గాంభీర్యం ప్రకటిస్తున్నారు. కాని లోలోపల ఆందోళన చెందుతున్నారు. రెబల్స్ అన్ని పార్టీలకు ఉన్నారు. చివరి నిమిషంలో తగ్గుతారని ఇరు పార్టీల నేతలంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ల కోసం ఆశించే అభ్యర్థుల సంఖ్య గతంతో పోల్చితే పెరిగింది. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్నికలు దూరంగా ఉండగా, కొత్తవారిని ప్రోత్సహిస్తాయి. వీరు టిక్కెట్ ఇస్తారనే నమ్మకంతో డబ్బులను ఎడాపెడా ఖర్చుపెడుతారు. తీరా ఎన్నికల తేదీ సమీపించే సరికి టిక్కెట్ లభించదు. దీంతో వీరు రెబల్స్‌గా మారుతున్నారు.