జాతీయ వార్తలు

తమిళ ఓటర్ల దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ ఏర్పడటంతో ఓట్లు చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది చెప్పటం కష్టంగా మారింది. ఓటర్ల మనోభావాలు తెలుసుకునేందుకు అన్నా డిఎంకె, డిఎంకె, కొత్తగా ఏర్పడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్‌తోపాటు ఒంటరిగా మిగిలిపోయిన బిజెపి, పిఎంకె కూడా సర్వేలు జరిపించుకుంటున్నాయి. ఒకటి, రెండు సర్వేలు జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకె తక్కువ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తుంటే, మిగతా సర్వేలు మాత్రం సంకీర్ణం తప్పదని అంచనా వేస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి జయలలితపట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని సర్వేలు సూచించటం గమనార్హం. తమిళనాడులో పోటీ ప్రధానంగా అన్నా డిఎంకె, డిఎంకె మధ్య ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఒకసారి అన్నా డిఎంకెను గెలిపిస్తే, ఆ తరువాత ఎన్నికల్లో డిఎంకెకు పట్టం కట్టటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి అలా జరగకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నా డిఎంకె ఒంటరిగా పోటీ చేస్తుంటే డిఎంకె, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నా డిఎంకెతో సీట్ల సర్దుబాటు కుదరకపోవటంతో బిజెపి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. పిఎంకె కూడా ఏకాకిగా మిగిపోయింది. విజయకాంత్ నాయకత్వంలో ఏర్పడిన కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కూటమిలో విజయకాంత్‌తోపాటు ఎండిఎంకె నేత వైగోకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి బలముంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట మూలంగా బిజెపికి కూడా కొన్ని ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బహుముఖ పోటీ మూలంగా ఓట్లు చీలిపోతే సంకీర్ణం తప్పదనే మాట వినిపిస్తోంది. పీపుల్స్ వెల్పేర్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా ‘కింగ్ మేకర్’ పాత్ర నిర్వహించే అవకాశాలున్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.
డిఎండికెతోపాటు వామపక్షాలు, ఎండిఎంకె, వీసీకెలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ప్రధాన పార్టీలైన అన్నా డిఎంకె, డిఎంకెలకు చెమటలు పట్టిస్తోంది. విజయకాంత్‌ను తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు డిఎంకె అధినేత ఎం.కరుణానిధి తీవ్రంగా కృషిచేసినా ఫలితం కనిపించలేదు. కరుణానిధితో విజయకాంత్ చేతులు కలిపి ఉంటే డిఎంకె కూటమి సునాయసంగా విజయం సాధించేది. అయితే విజయకాంత్ స్వంత కూటమి ఏర్పాటు చేసుకోవటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితి కొంత గందరగోళంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు పార్టీల కూటమితో ఎన్నికల బరిలోకి దిగిన జయలలిత ఏకంగా 150 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయటం వలన అధికారాన్ని నిలబెట్టుకో గలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయటంతోపాటు ‘అమ్మ’ పేరుతో చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోవటంలో జయలలిత విజయం సాధించారు. అందుకే జయలలిత పట్ల రాష్ట్ర ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ ఆదరణ ఓట్లుగా మారితే మెజారిటీ కొంత తగ్గినా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి.
శాసనసభ ఎన్నికల్లో అందరి దృష్టి కెప్టెన్ విజయకాంత్‌పై కేంద్రీకృతమై ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితతో జతకట్టి డిఎంకె కంటే ఎక్కువ సీట్లు సాధించుకున్న విజయకాంత్, ఈ ఎన్నికల్లో అత్యంత కీలక నాయకుడుగా మారారు. విజయకాంత్‌తో చేతులు కలిపేందుకు కరుణానిధి, జయలలితతోపాటు బిజెపి కూడా ప్రయత్నించింది. విజయకాంత్ మాత్రం తమ పార్టీ స్వతంత్రంగా రంగంలోకి దిగుతుందని ప్రకటిస్తూ వచ్చినా, ఆఖరు క్షణంలో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఏర్పాటుకు అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎండిఎంకె అధినేత వైగో కృషి మూలంగా విజయకాంత్ పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఏర్పాటుకు అంగీకరించారని అంటున్నారు. శాసనసభలో మొత్తం 234 సీట్లుంటే, విజయకాంత్ 124 సీట్లు తీసుకుని మిగతా 110 సీట్లను మిత్రపక్షాల మధ్య పంపిణీ చేశారు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్‌ను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. కూటమి విజయానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.