జాతీయ వార్తలు

మహిళా బిల్లుకు మళ్లీ పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పార్లమెంటు ఉభయ సభలు, ఆయా రాష్ట్రాల శాసనసభలతో పాటు ఇతర చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమ శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్, మిత్రపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశ్శా శాసనసభలు ఇదివరకే చేసిన తీర్మానాలను ఆమోదించాలని రాహుల్ గాంధీ లేఖలో కేంద్రాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మీరు కూడా మీ శాసనసభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని ఆయన కాంగ్రెస్, మిత్రపక్షాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇస్తూ తమ శాసనసభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, లోక్‌సభ సభ్యురాలు సుస్మితాదేవ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు గత నవంబర్‌లో లేఖలు రాశారని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోపాటు మిత్రపక్షాల ముఖ్యమంత్రులు కూడా తమ శాసనసభల్లో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపిస్తే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపాదించేందుకు కేంద్ర ప్రభుత్వంపై
వత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారితకు మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించటం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు రిజర్వు చేసేందుకు సంబందించిన బిల్లును 2010లో రాజ్యసభ ఆమోదించినా పదిహేనవ లోకసభ కాలం పూర్తి కావటంతో ఈ బిల్లు మురిగిపోయిందని రాహుల్ గాంధీ వివరించారు. దేశంలోని వివిధ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నది.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగటం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తోపాటు పలు ఇతర పార్టీల నాయకులు కొంతకాలం క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి చట్టసభల్లో మహిళలకు సీట్లు రిజర్వు చేసేందుకు సంబంధించిన మహిళా బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపాదిస్తే తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీ కూడా ఇచ్చామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమయంలో చట్టసభల్లో వారికి సముచిత ప్రాతినిధ్యం లేకపోవటం శోచనీయమని రాహుల్ చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటించేందుకు కాంగ్రెస్, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల శాసనసభల్లో ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారు.