జాతీయ వార్తలు

అత్యాచార బాధితురాలి గర్భస్రావానికి సుప్రీం అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: గర్భస్రావం చట్టంలోని ఒక నిబంధన ప్రకారం ఒక అత్యాచార బాధితురాలు సరిగా ఎదగని తన 24 వారాల గర్భస్థ పిండాన్ని తొలగించుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. గర్భాన్ని కొనసాగించుకోవడం వల్ల తల్లికి శారీరకంగా, మానసికంగా ముప్పు పొంచి ఉన్నదనే కారణంతో అత్యున్నత న్యాయస్థానం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971లోని సెక్షన్ 5 ప్రకారం ఈ అనుమతి ఇచ్చింది. తల్లి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న సమయంలో మాత్రమే 20 వారాల తరువాత గర్భస్రావానికి ఈ సెక్షన్ అనుమతిస్తోంది. గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికి శారీరకంగా, మానసికంగా ముప్పు పొంచి ఉందని మెడికల్ బోర్డు అభిప్రాయపడిందని, బోర్డు నిర్వహించిన పరీక్షలతో సంతృప్తి చెంది చట్టంలోని సెక్షన్ 5 కింద పిటిషనర్‌కు తన గర్భస్థ పిండాన్ని తొలగించుకునే స్వేచ్ఛను ఇస్తున్నట్లు న్యాయమూర్తులు జెఎస్ ఖేహార్, అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డు తన నివేదికను మూసి ఉంచిన కవర్‌లో పెట్టి ధర్మాసనానికి సమర్పించింది. పిటిషనర్ గర్భస్థ పిండం సరిగా ఎదగక ‘అసాధారణ’ స్థితిలో ఉందని మెడికల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో తేలిందని ధర్మాసనం తెలిపింది. బాధితురాలు 24 వారాల తన గర్భస్థ పిండాన్ని తొలగించుకోవాలని మెడికల్ బోర్డు సిఫార్సు చేసిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి.. తల్లి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున.. 20 వారాలు, అంతకన్నా ఎక్కువ రోజుల గర్భాన్ని తొలగించకూడదనే గర్భస్రావ చట్టంలోని సెక్షన్ 3 నిబంధన ఈ కేసులో వర్తించదని తెలిపారు.