జాతీయ వార్తలు

‘హోదా’బిల్లుపై స్తంభించిన రాజ్యసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు సోమవారం రాజ్యసభను స్తంభింపజేశారు. సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది. ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరగకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మ, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హదా డిమాండ్‌ను సమర్ధిస్తున్న టిడిపి సభ్యుడు సిఎం రమేష్‌ను కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు చేయి పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి ప్రత్యేక హోదా సవరణ బిల్లుపై ఎందుకు ఓటింగ్ జరపలేదంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్‌ను నిలదీశారు. బిల్లుపై వెంటనే ఓటింగ్ చేపట్టాలంటూ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. రాజ్యసభ సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక హోదా బిల్లుపై శుక్రవారం ఓటింగ్ జరపకపోవటం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. కెవిపి రామచందర్‌రావు, ఎంఎ ఖాన్, సుబ్బరామిరెడ్డి, రేణుకాచౌదరితోపాటు మెజారిటీ కాంగ్రెస్ సభ్యులంతా పోడియం వద్దకు దూసుకు వచ్చి తక్షణం ఓటింగ్ జరపాలంటూ డిమాండ్ చేశారు. అయితే ప్రైవేట్ మెంబర్ల బిల్లుపై కేవలం శుక్రవారం మాత్రమే చర్చ సాధ్యమవుతుంది కాబట్టి ఆగస్టు ఐదో తేదీ నాడు సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని డిప్యూటీ చైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులంతా పోడియం వద్దకు దూసుకు వచ్చి కెవిపి ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరపాలంటూ పెద్ద ఎత్తున పట్టుపట్టారు. ఈ దశలో రేణుకాచౌదరి సభా నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లి వాదించటం కనిపించింది. స్వయానా ప్రధాన మంత్రి సభలో ఇచ్చిన హామీని పూర్తి చేయకపోతే ఎలా అని పలువురు ప్రతిపక్ష సభ్యులు నిలదీశారు. సిపిఎం పక్ష నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. టిడిపి సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఏపిని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. మరో రెండుసార్లు సభ వాయదాపడినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మంగళవారం నాటికి వాయిదా వేశారు.

చిత్రం.. రాజ్యసభలో సోమవారం స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు