జాతీయ వార్తలు

చిత్రం.. భళారే రాజకీయ విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: ఎన్నికల ఏడాది రాజకీయ నేపథ్య చిత్రాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఐదు సంవత్సరాల పాటు ప్రజలను పాలించే పార్టీని నిర్ణయించే ఈ సంవత్సరం రాజకీయ పార్టీలు ఒక పక్క విమర్శలు, ప్రతి విమర్శలకు పదును పెడుతుండగా మరోవైపు వెండితెరపై సినిమాల ద్వారా పరోక్ష యుద్ధానికి తెరదీసారు. బయోపిక్‌లు రావడం, పాత్రల ద్వారా వివిధ పార్టీలపై పంచ్‌లు వేయడం సాధారణమే అయినా ఈ ఎన్నికల సంవత్సరంలో విడుదలవుతున్న నాలుగు సినిమాలు తమకు మైలేజ్‌ని ఇస్తాయని, అవతలి పార్టీలను బలహీన పరుస్తాయని ఆయా చిత్రాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్న పార్టీలు ఆశిస్తున్నాయి. అలాగే ప్రాంతీయపరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తీసిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ చిత్రం బుధవారమే దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ చిత్రం తమకు ఎంతో మేలు చేస్తుందని ఈ ఏడాది ఎన్నికలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది. కాగా, ఇదే ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు చేసిన అన్యాయం, ద్రోహం ప్రధానాంశాలుగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఆ పార్టీ నేతకు ఇబ్బంది కలిగించి విపక్షాలకు మేలు చేయవచ్చునని విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా సిద్ధమవుతోంది.
రాజకీయ నేపథ్యంలో తయారవుతూ వివాదాస్పదంగా మారి అందరి నోట్లో నానుతున్న సినిమాలను పరిశీలిస్తే అందులో ఏక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇదే వరుసలో గత ఏడాది పాకిస్తాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రయక్ నేపథ్యంలో తీసిన ఊరి, శివసేన అధినేత బాల్‌థాకరే బయోపిక్‌గా తీస్తున్న థాకరే, ద తాష్కెంట్ ఫైల్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవేకాక ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ఆధారంగా రెండు చిత్రాలు వస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ఒకదానిలో ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్‌ది కాగా, రెండోది పరేష్‌రావల్‌ది. ఈ వివాదాస్పద చిత్రాలేవి లోబడ్జెట్‌తోనే, ఊరుపేరు లేని నటులతోనో తీస్తున్నవేమీ కాదు. భారీ బడ్జెట్‌తో, ప్రముఖ నటులతో ఇవి తెరకెక్కుతున్నాయి. ఈనెల 11న విడుదలవుతున్న రోనీస్క్రూవాలా ఊరి-సర్జికల్ స్ట్రయక్ చిత్రంలో విక్కీకౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మనదేశంపై పాకిస్తాన్ జరుపుతున్న నిరంతర దాడులకు విసిగిపోయిన భారత సైన్యం 2016లో సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి వారి నాలుగు లాంచ్ పాడ్‌లను ధ్వంసం చేసే కథనం నేపథ్యం ఈ చిత్రానిది. ఈ పాకిస్తాన్‌పై దాడి చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల తమకు ఈ చిత్రం మైలేజ్‌ను ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
ప్రముఖ నటుడు అనుపమఖేర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘ద ఏక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆయన మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా తీసినది. ఇది ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా డమీగా ఆ పదవిలో కూర్చోబెట్టి గాంధీ కుటుంబం పది సంవత్సరాల పాటు చేసిన అక్రమాలను ఈ చిత్రం వెల్లడిస్తుందన్న ఊహాగానాలు ఇప్పటికే పెద్దయెత్తున రావడంతో ఈ చిత్రంపై వివాదాలు రాజుకున్నాయి. ఈ చిత్రం వెనుక బీజేపీ అధిష్టానం హస్తం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ ఈ చిత్రాన్ని అడ్డుపెట్టుకుంటోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సైతం ఈ చిత్రం పట్ల విముఖంగానే ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కూడా శుక్రవారం విడుదల కానుంది.
శివసేన పార్టీ అధినేత బాల్‌థాక్రే జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తీస్తున్న చిత్రానికి పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ రావుత్ రచయిత, నిర్మాతగా వ్యవహరిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం థాక్రే జయంతి అయిన జనవరి 25న రిలీజ్ అవుతుంది. అలాగే రాజకీయ నేపథ్యంతో తయారవుతున్న మరోచిత్రం ‘ ద తాష్కెంట్ ఫైల్స్’. దేశానికి రెండో ప్రధానిగా వ్యవహరించిన లాల్‌బహదూర్ శాస్ర్తీ అనుమానాస్పద స్థితిలో విదేశాల్లో మృతి చెందిన నేపథ్యం ఆధారంగా దీనిని చిత్రీకరిస్తున్నారు. బీజేపీ మద్దతుదారు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో కాని మార్చిలో కాని రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఈ రాజకీయ చిత్రాలు ఆయా పార్టీలకు ఎంతవరకు ఉపయోగపడతాయి, అసలు ఇవి ప్రజలపై ఏమన్నా ప్రభావం చూపుతాయా? అన్ని చిత్రాల్లాగే వీటిని వినోదం దృష్టితో చూసి వదిలేస్తారా? అన్న విషయంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఇవి ప్రజల మస్తిష్కాన్ని మారుస్తాయని పలువురు అంటుండగా, వారేమీ అంత అమాయకులు కారని, రెండున్నర గంటల సినిమా చూసి తమ అభిప్రాయాలు మార్చుకునే బలహీనులు అసలే కాదని మరో వర్గం వాదిస్తోంది.