జాతీయ వార్తలు

జైట్లీ.. తప్పుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం కోసం 25 ఐదు మిలియన్ యూరోలు అధికంగా చెల్లించిందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. దేశ ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జైట్లీ స్థానంలో తానుంటే ఈపాటికే రాజీనామా చేసి ఉండేవాడినని ఆయన తెలిపారు.
శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం 36 యుద్ధవిమానాలు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించటం ద్వారా దేశ భద్రతకు మోదీ ప్రభుత్వం ముప్పు తెచ్చిందని, ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు జేపీసీని నియమించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఈరోజు ఒక ఆంగ్లదినపత్రిక ప్రచురించిన వార్తను ఉటంకిస్తూ యుద్ధవిమానాల ధర ఖరారు చేసేందుకు నియమించిన రక్షణ శాఖ అధికారుల బృందంలోని ముగ్గురు సీనియర్ అధికారులు ప్రతి అంశంపై అభ్యంతరం తెలియజేయటం గమనించాలని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లో మన దేశ భద్రతకు అవసరమైన ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ధారించిన డబ్బును 126 విమానాలకు కేటాయించకుండా కేవలం 36 యుద్ధవిమానాలకు పరిమితం చేయటంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. దీనివల్లనే యుద్ధ విమానాల ఖరీదు విపరీతంగా పెరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం దేశప్రజల సొమ్మును రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే డస్సాల్ట్ సంస్థకు దోచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు.
యూపీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం చేసుకున్నప్పుడు మన భద్రతా అవసరాలకు అయ్యే ఖర్చును మొత్తం 126 విమానాలకు సరిపెడితే ఎన్డీఏ ప్రభుత్వం దానిని కేవలం 36 యుద్ధవిమానాలకు మాత్రమే పరిమితం చేయటం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో మన భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనకు 126 యుద్ధ విమానాలు అవసరముంటే కేవలం 36 యుద్ధ విమానాలనే ఎందుకు కొంటున్నారనే ప్రశ్నకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పటం లేదని ఆయన విమర్శించారు. డస్సాల్ట్ సంస్థకు అనవసరంగా లాభం చేకూర్చటం వెనక ఉన్న మర్మం ఏమిటి? దేనికోసం ఇలా చేశారని చిదంబరం నిలదీశారు. డస్సాల్ట్‌కు లాభం చేకూర్చులనేది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని ఆయన ఆరోపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవదీస్తామని చిదంబరం ప్రకటించారు.

ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆగమ్యగోచరమైనందుకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ మొదటి ఐదు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధి అధికంగా జరిగిందని ఆయన చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ ఐదు సంవత్సరాలతో పోల్చినా యూపీఏ పాలన మొదటి ఐదు సంవత్సరాల అభివృద్ధి అత్యధికమని ఆయన వివరించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం రానున్న నాలుగైదు నెలల్లో ఏం చేసినా ఈ పరిస్థితి మారదని చిదంబరం స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే ఈ పరిస్థితి మారుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫిస్కల్ లోటు సమస్యను పరిష్కరించటంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాలను ఈ ప్రభుత్వం సాధించలేకపోతోందని ఆయన విమర్శించారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదు, ఘోరమైన పెద్ద నోట్ల రద్దు, భయంకరమైన జీఎస్టీ పన్నులు విధించడం తప్ప ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుందని చిదంబరం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పద్ధతి లేదా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవలంబించిన పద్ధతిలో రైతుల ఖాతాల్లో డబ్ము జమ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోందన్న అనుమానాన్ని చిదంబరం వ్యక్తం చేశారు.