జాతీయ వార్తలు

మోదీ సర్కార్‌ను దించేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 19: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల మహార్యాలీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఎక్స్‌పైయిరీ డేట్ ముగిసిందని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. శనివారం నాడిక్కడ జరిగిన మెగార్యాలీలో పాల్గొన్న విపక్షనేతలు కలిసికట్టుగా పనిచేసి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని ఈ మహార్యాలీలో స్పష్టం చేశారు. కోల్‌కతాలోని బ్రిగెడ్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన నేతలు విభేదాలకు అతీతంగా లోక్‌సభ ఎన్నికల్లో పోరాడుతామన్నారు. ‘‘్ఢల్లీ మే సర్కార్ బదల్ దో’’ (్ఢల్లీలో ప్రభుత్వాన్ని మార్చండి) అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల యుద్ధ్భేరీ మోగించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శనివారం ఇక్కడ జరిగిన ప్రతి పక్షాల మహార్యాలీలో మాట్లాడిన మమతా బెనర్జీ ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. దాని ఎక్స్‌పైరీ డేట్ ముగిసింది’’ అని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఘన విజయం సాధించడం ఖాయమని ఉద్ఘాటించిన మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ర్యాలీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే సహా అనేకమంది ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పనిచేస్తాయని, ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరినీ ముందుగా ప్రకటించే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఉద్ఘాటించిన మమతా బెనర్జీ ఆ పార్టీ రాజకీయ మర్యాదలన్నింటినీ తుంగలో తొక్కిందనీ, ఏ వ్యవస్థకూ విలువలేకుండా చేసిందని అన్నారు. రాజకీయాల్లో కనీస పక్షమైన ఔచిత్యాన్ని కూడా మంటగలిపిన బీజేపీ తన వ్యతిరేకులందర్నీ దొంగలుగా ముద్ర వేస్తుందన్నారు. దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడిన మమతా బెనర్జీ బీజేపీలో సీనియర్ నాయకులకే మర్యాదలేదనీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గఢ్కరీలను ఈ కాషాయ పార్టీ పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రస్తుతం మోదీ ఆయన సన్నిహితులు సమిష్టి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్న మమత ఒకవేళ రానున్న ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే సీనియర్‌లకు మిగిలేది నిరాశేనని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు మించిన స్థాయిలో సూపర్ ఎమర్జెన్సీ అమలవుతోందని తెలిపిన మమతా
బెనర్జీ ‘‘కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చి తీరాల్సిందే’’ అని పిలుపునిచ్చారు. తన విచ్ఛిన్న రాజకీయాలతో భారత సమాజాన్ని బీజేపీ చిన్నాభిన్నం చేసిందని పేర్కొన్న ఆమె గత 70 సంవత్సరాల్లో పాకిస్తాన్ చేయలేని పనిని నాలుగన్నరేళ్ల కాలంలో బీజేపీ చేసిందని తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో బ్యాంకులు, సీబీఐ, ఆర్‌బీఐ దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యమే తీవ్ర నష్టానికి గురయ్యాయని అన్నారు. ఎన్‌పీఏలు పెరిగిపోయాయని, రాఫెల్, బీమా కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయన్నారు. ఇంకా అనేక స్కాములు ఈ నాలుగున్నరేళ్లలో జరిగాయని, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచితే వ్యవస్థ అంతా కుంభకోణాల మయం అవుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా బెంగాలీకి చెందిన ఓ నానుడిని ఉటంకించిన మమత ‘‘అందరికంటే పెద్దదొంగ స్వరమే తీవ్రంగా ఉంటుంది’’ అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీలన్నింటిపైనా కక్ష కడుతున్నారని సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్, మాయావతి చివరికి తనను కూడా వదిలిపెట్టడం లేదని మమత పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని పేర్కొన్న మమత ‘‘ఇకముందు వచ్చే రోజులు బీజేపీకి ఎంతమాత్రం మంచి రోజులు కావు’’ అని స్పష్టం చేశారు. దేశ ప్రజలిచ్చిన ఓ సువర్ణావకాశాన్ని చేజేతులా బీజేపీ వమ్ము చేసుకుందని అన్నారు. కేంద్రంలో బీజేపీని మారిస్తేనే దేశంలోని అన్ని వ్యవస్థలకు మంచిరోజులు వస్తాయని, ఇదే లక్ష్యంతో విపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

చిత్రం..కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగార్యాలీ వేదికపై ఐక్యతా రాగం ఆలపిస్తున్న విపక్షాల నేతలు