జాతీయ వార్తలు

గవర్నర్‌ను కలిసిన రూపానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, ఆగస్టు 6: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయిన విజయ్ రూపాని శనివారం రాష్ట్ర గవర్నర్ ఓపి కోహ్లీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. రూపాని ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దినేశ్ శర్మ ప్రకటించారు. రూపాని, శర్మ, ఉప ముఖ్యమంత్రిగా నియమితుడైన నితిన్ పటేల్, ఇతర రాష్ట్ర నేతలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మాత్రం వారివెంట లేకపోవడం గమనార్హం. కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ పేర్లను బిజెపి లెజిస్లేచర్ పార్టీ ఆమోదించినట్లు తాము గవర్నర్‌కు తెలియజేశామని సమావేశం అనంతరం శర్మ విలేఖరులకు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆమోదం తెలియజేశారని, మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రూపానీ, నితిన్‌తో పాటుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారో కూడా పార్టీ స్పష్టంగా తెలియజేయలేదు.
శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య బిజెపి అధినాయకత్వం గుజరాత్ ముఖ్యమంత్రి పదవి రేసులో అందరికన్నా ముందున్న నితిన్ పటేల్‌కు బదులుగా విజయ్ రూపానీని ఆనందీబెన్ స్థానంలో ఎంపిక చేయడం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనందీబెన్ ముఠాల మధ్య విభేదాల కారణంగా లెజిస్లేచర్ పార్టీ సమావేశం దాదాపు రెండు గంటలు ఆలస్యంకూడా అయింది. తనకు విశ్వాసపాత్రుడైన నితిన్ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆనందీబెన్ పట్టుబట్టగా, తన మనిషి అయిన రూపానీయే ముఖ్యమంత్రి కావాలని అమిత్ షా భీష్మించుకోవడమే దీనికి కారణం. చివరికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా ఇతర కేంద్ర నాయకులు జోక్యం చేసుకోవడంతో రాజీమార్గంగా రూపానీని ముఖ్యమంత్రిగా, నితిన్ పటేల్‌ను ఉపముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరిగింది.